నిజామాబాద్ రూరల్, ఆగస్టు 15 : సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ బంగారు తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిచ్చి కూతలు కూస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. అన్ని జిల్లాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రజల మన్ననలు పొందుతుంటే వారు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఓ బీజేపీ నాయకుడు జిల్లా అభివృద్ధిని విస్మరించడంతోపాటు తన స్థాయిని మర్చిపోయి సీఎంను నిందిచడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కుట్రపూరితంగా వక్రీకరించి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నగర శివారులోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే మాట్లాడారు. రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 20 వేల ఎకరాలకు మాత్రమే కాలువ నీరు సరఫరా అవుతున్నాయని, మిగతా 80 వేల ఎకరాలను బోర్లు, చెరువులు, కుంటల కింద సాగు చేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం 21వ ప్యాకేజీ కింద రూ. 400 కోట్లతో మంచిప్ప రిజర్వాయర్, రూ. 2,228 కోట్లతో పైపులైన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, దీంతో లక్ష ఎకరాల్లో రెండు పంటలు పండించుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇజ్రాయెల్ తరహాలో పైపులైన్ ద్వారా సాగునీరందించే పనులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. అదేవిధంగా రూ. 50 కోట్లతో వివిధ గ్రామాల్లో నిర్మించిన 10 చెక్‌డ్యాముల ఫలితంగా జలకళతోపాటు భూగర్భ జలమట్టం పెంపునకు దోహదపడినట్లు తెలిపారు. ఎస్సీ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే దళితబంధు పథకాన్ని రూపొందించారని తెలిపారు. సమావేశంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, సుమలత, దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, కమలా నరేశ్, ఎంపీపీలు అనూషా ప్రేమ్‌దాస్, లతా కన్నీరాం, డీసీసీబీ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షుడు ముస్కె సంతోష్, నాయకుడు గోర్కంటి లింగన్న పాల్గొన్నారు.