ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు అధికమవుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే 190 కేసులు నమోదు కాగా
పది మంది వరకు మరణించినట్లు వైద్యాధికారులు తెలిపారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ డెంగీ ప్రబలే అవకాశముందని, జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
డిచ్పల్లి, సెప్టెంబర్ 12 : డెంగీ అనగానే ఉమ్మడి జిల్లా జనం జంకుతున్నారు. విద్యావంతులు సైతం డెంగీ జ్వరం పేరు చెబితే ఇంటిల్లిపాదికీ జ్వరం వచ్చినంత పని అవుతున్నది. డెంగీకి చికిత్స లేదని, దీంతో ప్రాణనష్టం సంభవిస్తున్నదని భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 190 కేసులు నమోదు కాగా, డెంగీతో పది మంది వరకు మరణించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. డెంగీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తూ, లక్షణాలపై అవగాహన పెంచుకుంటూ మొదటి దశలోనే నయం చేసుకోవచ్చని వైద్యులు
వెల్లడిస్తున్నారు. ఈ డెంగీ జ్వరం పట్టపగలు ఏడిస్ ఈజిైప్టె అనే దోమకాటుతో వస్తుంది. అంతేకాదు ఒకరి నుంచి మరొకరికి దోమ కాటుతో వ్యాప్తి చెందే అవకాశముంటుంది. ఈ రకమైన దోమలు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. నీరు నిల్వ ఉండకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దోమ తెరలు వాడుతూ, పిల్లలు, పెద్దలు శరీర భాగాలకు దోమల నుంచి రక్షణ ఇచ్చే దుస్తులను ధరిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇరు జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. కుంటలు, నీటి నిల్వలు ఉన్న చోట ఆయిల్బాల్స్ వేసి నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారినపడిన వారితోపాటు డెంగీ బాధితులు సైతం ప్రభుత్వ దవాఖానలకు వస్తుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
డెంగీ జ్వరం లక్షణాలు
హఠాత్తుగా జ్వర తీవ్రత ఎక్కువ అవుతుంది.
తలనొప్పి ముఖ్యంగా నుదుటి మీద నొప్పి అధికంగా ఉంటుంది.
కన్ను కదిలితే నొప్పి అనిపించడం.. కంటి కదలికలు తగ్గుతాయి.
కండరాలు, కీళ్ల నొప్పి అధికమవుతాయి.
వాంతులు అవుతున్న ఫీలింగ్.
నోరు ఎండిపోయి.. దాహం అధికంగా ఉండడం.
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు.
చర్యలు చేపడుతున్నాం
జిల్లాలో డెంగీ నియంత్రణ చర్యలు చేపట్టాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది తిరుగుతూ ప్రజలకు డెంగీపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.