వరద తాకిడికి కొట్టుకుపోయిన సాలూరా వంతెన
తెలంగాణ – మహారాష్ట్ర మధ్య స్తంభించిన రాకపోకలు
నిజాం హయాంలో నిర్మించిన వందేండ్ల వంతెన ధ్వంసం
ప్రమాదకరంగా మారిన కొత్త బ్రిడ్జి
ఇటీవలే వంతెన దుస్థితిపై హెచ్చరించిన ‘నమస్తే తెలంగాణ’
కందకుర్తి- ధర్మాబాద్ మధ్య నాలుగులేన్ల రహదారి తునాతునకలు
విచ్చుకత్తిలా విరుచుకుపడిన వర్షం విధ్వంసాన్ని మిగిల్చింది. వరద శాంతించాక నష్టం స్పష్టమైంది. బోధన్ మండలం సాలూరా వద్దనున్న వందేండ్ల పురాతన వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. మంజీరానదిపై తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిజాంహయాంలో నిర్మించిన ఈ వంతెన దుస్థితిపై ‘నమస్తే తెలంగాణ’ వారం క్రితం కథనాన్ని ప్రచురించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా నిధుల్ని ఇవ్వకపోవడం వల్ల అదేచోట కొత్త వంతెన నిర్మించాలన్న ప్రతిపాదన ముందుకుసాగలేదు. నిజాం కాలం నాటి ఆ వారధి తాజా వర్షాలకు కొట్టుకు పోయింది. ఇక రెంజల్ మండలంలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కందకుర్తి-ధర్మాబాద్ మధ్య ఉన్న నాలుగు లేన్ల రహదారి వరద ఉధృతికి తీవ్రంగా ధ్వసమైంది.
బోధన్, సెప్టెంబరు 9: భారీ వర్షాలకు మంజీరానదికి ఎగువ నుంచి వస్తున్న వరదకు తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో బోధన్ మండలం సాలూరా వద్ద వందేళ్లనాటి పురాతనపై వంతెన కొట్టుకుపోయింది. భారీ వరదకు ఈ పాత వంతెన ధ్వంసం కావడం, మూడున్నర దశాబ్దాల కిందట ఈ వంతెనకు సమాంతరంగా నిర్మించిన కొత్త వంతెనకు బీటలు రావడంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా పాత వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, గురువారం ఉదయం వరద ఉధృతి తగ్గడంతో ఆ వంతెన కొట్టుకుపోయిన విషయం వెలుగుచూసింది. ఉదయం వాహనదారులు వంతెన ధ్వంసం కావడం గమనించి అవాక్కయ్యారు. వంతెన ధ్వంసం కావడంతో వేలాది కిలోల బరువు ఉన్న రాతి పలకలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ వంతెనను 1930 దశకం ప్రారంభంలో ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించారు. రాతితో నిర్మించిన ఈ వంతెన ఇప్పటివరకు చెక్కుచెదరని రీతిలో ఇరు రాష్ర్టాల మధ్య రాకపోకలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇది లోలెవల్ వంతెన కావడంతో దీనికి ప్రత్యామ్నాయంగా 1986లో మరో భారీ వంతెనను నిర్మించారు. అప్పట్లో ఆ వంతెనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్బీ చవాన్ ప్రారంభించారు. కాగా, ఈ కొత్త వంతెనకు కొంతకాలంగా బీటలు రావడంతో భారీ వాహనాలను అనుమతించడంలేదు. పురాతన వంతెన కూడా ధ్వంసమవడంతో రెండు రాష్ర్టాల మధ్య వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. సాలూరా వద్ద మన భూభాగంలో బోధన్ – నాందెడ్ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసేందుకు అధికారులు రోడ్డుకు కందకం చేశారు.
‘నమస్తే తెలంగాణ’ ఎప్పుడో హెచ్చరించింది..
సాలూరా వద్ద తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో నిర్మించిన కొత్త వంతెనకు పగుళ్లు వచ్చిన విషయంతో పాటు పురాతనమైన వంతెన శిథిలమవుతున్న తీరును 2016లోనూ, గత నెలలోనూ ‘నమస్తే తెలంగాణ’ నిజామాబాద్ టాబ్లాయిడ్లో కథనాలు ప్రచురించింది. కొత్త వంతెనను, పాత వంతెనను మహారాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్న తీరును ఆ కథనాల్లో వివరించింది. ఇటీవల ‘మహా నిర్లక్ష్యం’ కథనం ప్రచురించిన పది రోజులకే పురాతనమైన వంతెన వరద ధాటికి కొట్టుకుపోవడం గమనార్హం.