ఇద్దరుకూతుళ్లతో కలిసి చెరువులోకి దూకేందుకు సిద్ధమైన మహిళ
సకాలంలో వెళ్లి ఆత్మహత్యను నివారించిన పోలీసులు
ఇందూరు, సెప్టెంబర్ 9 : చెరువులో ఆత్మహత్యకు యత్నించిన తల్లీకూతుళ్లను ఆరో టౌన్‌కు చెందిన పోలీసులు కాపాడి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను 6వ టౌన్ ఎస్సై ఆంజనేయులు గురువారం వెల్లడించారు. ఎడపల్లి మండలం బాబునగర్ గ్రామానికి చెందిన ఉసిరికాయల మాధవి, తన ఇద్దరు కూతుళ్లు రక్షిత (5), హారిక (4)తో కలిసి అశోక్ సాగర్‌లో ఆత్మహత్యకు యత్నించగా..అదేసమయంలో నెహ్రూనగర్, అశోక్‌సాగర్‌కు పరిశీలన తనిఖీ నిమిత్తం వెళ్లిన ఎస్సై ఆంజనేయులు గమనించారు. చెరువులో వారు దూకబోతుండగా వెళ్లి కాపాడారు. వారి వివరాలను తెలుసుకున్నారు. తన భర్త రాజుతో ఉన్న గొడవల కారణంగా ఆత్మహత్యకు యత్నించినట్లు మాధవి పోలీసులకు వివరించింది. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఉంటున్న తల్లి గాజుల రాజమణి ఇంటికి పంపించారు. ముగ్గురి ప్రాణాలు కాపాడినందుకు ఎస్సై ఆంజనేయులు, సిబ్బందిని ఏసీపీ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ అభినందించారు.