నిజామాబాద్ నగరంపై వర్షం జలఖడ్గాన్ని ఝుళిపించింది. ఏకధాటిగా 12గంటలపాటు కురిసిన భారీ వర్షం ఉమ్మడి జిల్లాలో బీభత్సాన్ని సృష్టించింది. నిజామాబాద్ జిల్లాలో 88మి.మీ, కామారెడ్డిలో 70.6 మి.మీ వర్షపాతం నమోదైంది. జలవిలయానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు చిగురుటాకులా వణికాయి. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా పూలాంగ్ వాగు పొంగిపొర్లడంతో నిజామాబాద్‌లో పలు కాలనీలు నీటమునిగాయి. రహదారులు వాగుల్లా మారాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు పలు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎడతెరిపి లేని వానలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు చిగురుటాకులా వణికాయి. భారీ వర్షాలతో అనేక గ్రామాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలతోపాటు భారీ ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజీర సైతం ఎగువ నుంచి వస్తోన్న వరద ఉగ్రరూపం దాల్చుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా వరద నీరును విడుదల చేశారు. రెండు జిల్లాల్లోనూ జడి వానతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. చెరువులు అలుగులు దుంకగా, వరద నీటి ప్రవాహంతో బీటీ రోడ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు విరిగి రోడ్లపై పడడంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెక్‌డ్యాముల మీదుగా వరద నీరు ఎగిసి పడుతూ కదిలింది. నిజామాబాద్ నగరంలో దశాబ్ద కాలంలో కనిపించని జలమయమైన దృశ్యాలు సాక్షాత్కరించాయి. పూలాంగ్ వాగు ఉధృతికి స్థానిక ప్రజానీకం భయాందోళనకు గురైంది. నూతన కలెక్టరేట్ సమీపంలో వరద నీటితో బైపాస్ రోడ్డు జలమయమై కనిపించింది. ఇదిలా ఉండగా రెండు రోజులుగా కురిసిన భారీ వానలతో నమోదైన వర్షపాతంతో నిజామాబాద్‌లోని ఏడు మండలాలు, కామారెడ్డిలో మాచారెడ్డి మండలాన్ని ఆరెంజ్ జోన్‌గా వాతావరణ శాఖ గుర్తించింది. భారీ వానలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేశ్ వీ పాటిల్‌లు ఉత్తర్వులు జారీ చేశారు.
పలుచోట్ల ఆస్తి, ప్రాణ నష్టం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలతో పలుచోట్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్‌లో ఓ పౌల్ట్రీ ఫారంలోకి వరద చేరడంతో దాదాపు ఐదు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. మాక్లూర్ మండలం గంగరమందలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో చెట్లు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధర్పల్లి మండలంలోని మైలారంలో రాహుల్బీ అనే వ్యక్తికి సంబంధించిన ఇంటి గోడ కూలింది. ప్రాణ నష్టం తప్పింది. రామడుగు ప్రాజెక్టులో ప్రమాదకర స్థాయికి నీటి మట్టం చేరడంతో ట్రైనీ కలెక్టర్ మకరంద్ పరిశీలించారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్‌లో ఓ పెంకుటిల్లు ధ్వంసమైంది. బోధన్ పట్టణంలో వెంకటేశ్వర కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. వేల్పూర్ మండలంలో మోతె వాగు ఉధృతంగా ప్రవహించడంతో భీమ్‌గల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో ఆరు ఇండ్లు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఎడపల్లి మండలం ఒడ్డాపల్లిలో దేవాలయం ప్రహరీ కూలింది. ఠానాకలాన్ – కుర్నాపల్లి రోడ్డులో వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయా యి. కమ్మర్పల్లి మండలం కోనాపూర్‌లో ఇంటి పైకప్పు కూలింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్‌లో ఇల్లు కూలడంతో ఓ కుటుంబం రోడ్డున పడింది. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ దేవస్థానంలోకి భారీగా వరద నీరు చేరింది. ఎల్లారెడ్డి మండలం హజీపూర్‌లో ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలమట్టమైంది. కామారెడ్డి మండలం గర్గుల్‌లో ఇంటి గోడ కూలి ఓ మహిళ మృతి చెందింది.
గోదావరి వరద ఉధృతి
గోదావరి నది మరోమారు ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహించింది. ఓ వైపు మంజీర నది నుంచి వచ్చిన వరదను తనలో కలుపుకొని త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి వేగంగా కదులుతూ సాగింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సోమవారం 50వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా మంగళవారం తెల్లవారుజాము వరకు రెట్టింపు స్థాయిలో వరద రావడం ప్రారంభమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ ఇంజినీర్లు మంగళవారం ఉదయం 3గంటలకు 30 గేట్లు ఎత్తి దిగువకు 2లక్షల క్యూసెక్కుల మేర నీటిని వదిలిపెట్టారు. ఉదయం 10గంటలకు ఇన్‌ఫ్లో 2లక్షా 51వేల క్యూసెక్కులకు చేరడంతో అవుట్‌ఫ్లోను 1.96లక్షల క్యూసెక్కులు చేశారు. మధ్యాహ్నం 3గంటలకు ఇన్‌ఫ్లో మూడు లక్షల క్యూసెక్కులకు చేరగా అప్రమత్తమైన అధికారులు 33 వరద గేట్ల ద్వారా 3లక్షల 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వచ్చిన వరదను వచ్చినట్లుగా పంపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం ఆధారంగా వాతావరణ శాఖ ఆరెంజ్ జోన్‌గా గుర్తించింది. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో అతి భారీ వర్షపాతం నమోదు కావడంతో ఆరెంజ్ జోన్‌గా నిర్ధారించారు.