24గంటలూ అందుబాటులో ఉండండి..
అధికారులకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశం
వర్షాల నేపథ్యంలో హుటాహుటిన జిల్లాకు వేముల
నిజామాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అతి భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా వరదమయంగా మారడంతో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. కుండపోత వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల మేరకు అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి పరిస్థితులను సమీక్షించిన సీఎం నేరుగా మంత్రులతోనూ మాట్లాడారు. ఆయా జిల్లాల్లో వరద ఉధృతి పరిస్థితులపై ఆరా తీశారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు పయనమైన మంత్రి వేముల మార్గమధ్యంలోనే జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మరింతగా నీటిని వదిలేందుకు అధికారులు సమాయత్తం కావాలని సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నిండడంతో పాటు మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో మంజీర కూడా ఉప్పొంగే అవకాశాలున్నాయని అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చూడాలని మంత్రి వేముల ఆదేశాలు ఇచ్చారు.
24గంటలు అందుబాటులో ఉండండి..
వరదలతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వాధికారులు హెడ్ క్వార్టర్స్‌లో ఉంటూ ప్రజల యోగక్షేమాల కోసం పాటుపడాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ వరద నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి, మంజీరా నదుల నుంచి వరద పెరుగుతుండడంతో వెంటనే ఇరిగేషన్ సీఈ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇంజినీర్లతో మంత్రి వేముల ఫోన్లో సంభాషించారు. తాజా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఔట్‌ఫ్లో దాదాపుగా 4లక్షల క్యూసెక్కులకు పెరిగే ఆస్కారం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్అండ్ బీ, విద్యుత్, ఇరిగేషన్ శాఖల అధికారులు 24గంటలు అందుబాటులో ఉండాలన్నారు. సెలవులు రద్దు చేసుకుని, విధుల్లో ఉండాలని చెప్పారు. వర్షాలకు దెబ్బతిన్న బీటీ రోడ్లకు తాత్కాలికంగా ప్రయాణం కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోడ్లపై వరద నీరు పారుతున్నట్లు అయితే అక్కడే గ్రామ రెవెన్యూ సహాయకుడు పర్యవేక్షించేలా చూడాలన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఎన్పీడీసీఎల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ శాఖలతో సమన్వయం చేసుకోవాలని వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు.