
నిజామాబాద్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా అమలు చేయబోతున్న దళితబంధు పథకం వచ్చే ఐదు నెలల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చేరనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తొలి దశలో 100 మందికి ఈ పథకం ప్రయోజనాలు అందించేందుకు సర్కారు సిద్ధం అవుతున్నది. అంతకు ముందే నలుదిక్కులా దళితబంధు పథకం గొప్పతనాన్ని ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులకు, దళిత ప్రజలకు తెలిసే విధంగా పైలట్ పథకం సైతం అమలు కాబోతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే జుక్కల్ నియోజకవర్గం నుంచి నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలుకు నిర్ణయించింది. ఇప్పటికే క్షేత్ర స్థాయి పరిశీలనలు, పథకం అమలుకు సంబంధించిన రూట్‌మ్యాప్ సిద్ధం అవుతున్నది. త్వరలోనే అట్టడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆయా కుటుంబాలకు మేలు చేకూరబోతుండడంతో పేద కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇదే రీతిలో 2022 మార్చి నెలాఖరులోగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 మందికి అందించబోయే దళిత బంధు పథకం అమలుకు నిజాంసాగర్ మండలమే ఆధారంగా మారనున్నది. అసెంబ్లీ వేదికగా దళితబంధు పథకంపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయా వర్గాల ప్రజల్లో ధైర్యాన్ని, ఆత్మైస్థెర్యాన్ని నింపింది.
నలుదిక్కులా ఆశయం…
దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతున్న దళిత బంధు పథకం ప్రాథమిక దశలో రాష్ట్ర వ్యాప్తంగా నలుదిక్కులా అమలవుతోంది. హుజూరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన పథకానికి ఇప్పుడు పశ్చిమ దిశలో కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు స్థానమైన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. దాదాపు 5వేల మంది దళిత ప్రజలు నివసిస్తోన్న ఈ మండలంలో గడిచిన 45 రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం ప్రతిష్టాత్మకమైన పథకం అమలుపై పరిశీలన జరుపుతున్నది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన కుటుంబాల స్థితిగతులను మొదట సర్వే నిర్వహించారు. వారి ఆర్థిక పరిస్థితిపై అంచనాలు రూపొందించారు.
భౌగోళిక, ఆర్థిక, సామాజిక, అక్షరాస్యత, పేదరికం వంటి అంశాలతో కుటుంబాల వారీగా వివరాలు క్రోడీకరించారు. ఏ గ్రామంలో ఎంత మంది జనాభా, కుటుంబాలున్నాయో వివరాలను సిద్ధం చేశారు. అతి త్వరలోనే ప్రభుత్వం నిధులు కేటాయింపులు జరుపగానే నిజాంసాగర్ మండలంలో దాదాపుగా 1800 దళిత కుటుంబాలకు దళితబంధు పథకం అమలు కాబోతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భవిష్యత్తులో అమలుకానున్న దళితబంధు పథకానికి ఈ మండలమే దిక్సూచిగా మారనున్నది. నలుదిశలా ఈ అద్భుత పథకాన్ని విస్తరింపజేయాలనే ఆలోచనతోనే నిజాంసాగర్ మండలాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారు.
ఐదు నెలల్లో 900 మందికి…
2021-22 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో తొలుత 100 మందికి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఎమ్మెల్యేలు నిర్ణయించిన పల్లె లేదంటే మున్సిపల్ వార్డులో వంద మంది లబ్ధిదారులకు దళిత బంధు ప్రయోజనాన్ని చేకూరుస్తారు. ఈ ప్రక్రియ మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ లెక్కన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 900 మందికి దళిత బంధు ప్రయోజనం దక్కబోతోంది. నిజాంసాగర్ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోన్న నిధులకు సంబంధం లేకుండా జుక్కల్ నియోజకవర్గంలో మార్చి నాటికి మరో 100 మంది పేద కుటుంబాలకు లబ్ధి జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సరిగ్గా ఐదు నెలల్లోనే దళిత బంధు పథకం నేరుగా పేద కుటుంబాల్లో వెలుగు లు నింపనుండడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దళిత బంధు పథకానికి సర్కారు భారీగా నిధులు కేటాయించి లబ్ధిదారుల సంఖ్యను పెంచనున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరింత మందికి ఈ పథకాన్ని అంచెలంచెలుగా విస్తరిస్తారు.
నిజామాబాద్‌లో 13.78శాతం… కామారెడ్డిలో 15.76 శాతం…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దళిత కుటుంబాలు ప్రాధాన్యత స్థాయిలో ఉన్నారు. శాతాల్లో పరిశీలిస్తే నిజామాబాద్‌తో పోలిస్తే కామారెడ్డిలోనే వీరి సంఖ్య అధికం గా ఉంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం జనాభా 15 లక్షల 77వేల మంది. ఇందులో షెడ్యూల్ కులాల వారు 2లక్షల 17వేల మంది ఉన్నారు. ఎస్సీల్లో పురుషులు 1.04 లక్షల మంది, స్త్రీలు 1.12లక్షల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 13.78 శాతంగా ఉన్నట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 9లక్షల 72 వేల మంది మొత్తం జనాభా కాగా ఇందులో షెడ్యూల్ కులాల వారు లక్షా 53 వేల మంది ఉన్నారు. వీరిలో పురుషులు 74,133 మంది, స్త్రీలు 79,169 మంది ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. మొత్తం జనాభాలో 15.76 శాతంగా ఉన్నట్లుగా తేలింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్సీ జనాభాలో జుక్కల్ నియోజకవర్గమే ముందుంది. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దును కలిగిన ఈ నియోజకవర్గం ఆది నుంచి వెనుకబాటుకు గురవుతూ వస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు నిజాంసాగర్ మండలం దిక్సూచిగా నిలవనున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం నుంచి ఈ పథకం అమలుకు నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుకింద ప్రభుత్వం ఎంపిక చేసింది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వందమందికి దళితబంధు ఫలాలను అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చే మార్చి నెలాఖరులోగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 900 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే పైలట్ మండలమైన నిజాంసాగర్‌లో సర్వే నిర్వహించిన అధికారులు.. కుటుంబాలవారీగా వివరాలను సేకరించారు. త్వరలోనే మండలంలోని దాదాపు 1800 దళిత కుటుంబాలకు దళితబంధు అమలు కానున్నది.
మా తలరాతలు మారుతాయి
దళితబంధు పథకంతో మా తలరాతలు మారుతాయి. దళిత సమాజపు అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకం హర్షణీయం. తరతరాలుగా
పేదరికంలో గడిపిన రోజులిక ఉండవు. మా తర్వాతి తరాలూ సంతోషంగా ఉంటాయి.