అవమాన భారంతో బాలిక ఆత్మహత్య
పొదల్లో నవజాత శిశువు లభ్యం
చికిత్సనిమిత్తం కామారెడ్డి దవాఖానకు తరలింపు
గాంధారి, సెప్టెంబర్ 1: తెలిసీ తెలియని వయస్సులో చేసిన తప్పుకు ఆ బాలిక అవమానభారంతో ఆత్మహత్య చేసుకోగా.. అభంశుభం తెలియని శిశువు అనాథగా మారాడు. నవజాత శిశువుకు జన్మనిచ్చిన బాలిక పసిగుడ్డును ముళ్లపొదల్లో పడేసి.. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు, అధికారులు ఆ శిశువును చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్మల్తండాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బీర్మల్తండాకు చెందిన 13ఏండ్ల బాలిక మంగళవారం రాత్రి తండా శివారులోని దుర్గంచెరువు సమీపంలో మగ శిశువుకు జన్మనిచ్చింది. వెంటనే నవజాత శిశువును పొదల్లో పడేసి.. పక్కనే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పసికందు రోదన విన్న తండావాసులు పొదల్లో నవజాతశిశువును గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు, సంక్షేమ శాఖ అధికారులు బుధవారం తెల్లవారుజామున 3గంటలప్రాంతంలో తండాకు చేరుకున్నారు. పొదల్లో పడి ఉన్న శిశువును శుభ్రంచేసి 1098 వాహనంలో కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని, చికిత్స అందిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. ఆరోగ్యస్థితి మెరుగైన తర్వాత నిజామాబాద్ శిశువిహార్కి తరలించనున్నట్లు కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారిణి సరస్వతి తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని ఆమె చెప్పారు. మరోవైపు బాలిక మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైనర్ ఆత్మహత్యకు గల కారణాలపై స్థానికంగా ఆరా తీస్తున్నారు. మాయమాటలతో బాలికను మోసం చేసినవారెవరో గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని గాంధారి ఎస్సై శంకర్ తెలిపారు.