పిట్లం/బిచ్కుంద/బాన్సువాడ, ఏప్రిల్ 22 : మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పిట్లం మండలకేంద్రంలోని బోయివాడ ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక బాలికల ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ శుక్రవారం పరిశీలించారు. మండలంలోని 18 పాఠశాలలు మన ఊరు -మనబడి కార్యక్రమానికి ఎంపికైనట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పా రు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీడీవో వెంకటేశ్వర్, ఎంపీవో బ్రహ్మం, పీఆర్ఏఈ సురేశ్, ఎంఈవో దేవీసింగ్, పాఠశాల చైర్మన్లు నర్సాగౌడ్, షఫీ, ప్రధానోపాధ్యాయులు నారాయణ, హర్జ్యా, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ జొన్న శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
బిచ్కుంద మండలంలోని బండా రెంజల్ ఎంపీయూపీఎస్ను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలను ఎంపిక చేశామని, రూ. 21 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామపెద్దలతో మాట్లాడారు. పాఠశాలలో అదనపు తరగతి గదులను నిర్మిస్తామని, మరమ్మతులు చేయించడంతోపాటు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మరుగుదొడ్లు, బాత్రూముల నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. ఆయన వెంట సర్పంచ్ బాల్‌రాజ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సిద్ధిరాం పటేల్, పంచాయతీ ఏఈ మధుసూదన్, తహసీల్దార్ రవికాంత్, ఉపాధ్యాయులు ఉన్నారు.
బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఇటీవల మన ఊరు – మన బడి కార్యక్రమంలో ఎంపికైంది. పాఠశాలలో మౌలిక వసతుల కోసం రూ.16 లక్షలు మంజూరు కావడంతో పాఠశాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. కిచెన్ షెడ్, ప్రహరీ, టాయిలెట్ల నిర్మాణానికి నిధుల మంజూరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ ఎంపీపీ ప్రకాశ్, తహసీల్దార్ గంగాధర్, సంబంధిత శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ పనుల పరిశీలన
సదాశివనగర్, ఏప్రిల్ 22 : మండలంలోని భూంపల్లి గ్రామ శివారులోని లొద్ది వాగుచెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెరువులోని మట్టిని రైతులు పొలాల్లో వేసుకోవాలని అన్నారు. వచ్చే వారం నుంచి గ్రామంలో 900 మంది కూలీలకు పనులు కల్పించాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ శంభు లలితాబాయి, ఎంపీపీ గైని అనసూయారమేశ్, పద్మాజివాడి విండో చైర్మన్ గంగాధర్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దత్తురావు, ఎంపీడీవో కలం రాజ్వీర్, ఎంపీవో సురేందర్ రెడ్డి, ఏపీవో తిరుపతి నాయక్, టీఏ సంతోష్, వీఆర్ఏలు మొగ్గం సంజీవ్, లక్ష్మణ్ ఉన్నారు.