నిజామాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);రైతువ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వంపై తన పోరాటాన్ని టీఆర్ఎస్ మరింత తీవ్రతరం చేసింది. వివిధదశల్లో చేస్తున్న నిరసనల్లో భాగంగా నేడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకేంద్రాల్లో మహాధర్నాలు చేపట్టనున్నారు. ఈ నిరసనల కోసం టీఆర్ఎస్ విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా, ప్రజాప్రతినిధులందరూ హాజరవనున్నారు.
‘వన్ నేషన్-వన్ పాలసీ’ని నిత్యం నినదించే మోదీ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక విధానాన్ని, ఇతర పార్టీలు అధికారంలో ఉన్నచోట్ల మరోవిధంగా అధికారాన్ని చలాయిస్తున్నది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి ఉన్నప్పటికీ అందుకు విఘాతం కలిగిస్తున్నది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ.. గడిచిన ఎనిమిదేండ్లల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా కీలకమైన రంగాల్లో మేటిగా నిలిచింది. అన్ని రాష్ర్టాలకు దీటుగా వృద్ధి సాధించింది.
రాజకీయ కక్షసాధింపు చర్యలతో తెలంగాణపై బీజేపీ సర్కారు ఒంటెద్దు పోకడలను ప్రదర్శిస్తున్నది. వడ్లను సేకరించడంలో నిరంకుశంగా వ్యవహరిస్తూ సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తున్నది. రైతు వ్యతిరేకిగా ముద్రపడిన బీజేపీకి సరైనరీతిలో బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా నిశ్చయించింది. ఈ మేరకు అంచెలంచెలుగా ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయగా, రైతులను సమీకరించి కేంద్రంతో కొట్లాడుతున్నది. ఇందులో భాగంగా నేడు జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు చేయనున్నారు. ఇందుకోసం ఉభయ జిల్లా కేంద్రాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుండగా ప్రజాప్రతినిధులంతా హాజరుకానున్నారు.
నేడు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు..
టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం ధర్నాలు చేయనున్నారు. పంజాబ్‌లో వందశాతం ధాన్యాన్ని సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో పండిస్తున్న వడ్లను కూడా మొత్తం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. బాయిల్డ్ రైస్, రా రైస్ పేరుతో రోజుకో విధంగా కేంద్ర ప్రభుత్వం నాటకమాడుతుండడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా మండి పడుతున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు నిరసనల ద్వారా కేంద్రానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు 4వ తేదీన మండల కేంద్రాల్లో ఉవ్వెత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. 6న నిర్దేశించిన ప్రాంతాల్లో జాతీయ రహదారుల దిగ్బంధం, రాస్తారోకోలు నిర్వహించారు. 7న జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున మహాధర్నాలు చేయను న్నారు. నిజామాబాద్‌లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్ అహ్మద్, కామారెడ్డిలో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి పాల్గొననున్నారు.
కేంద్రంపై పోరుబాట..
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో అలుపెరగని పోరాటానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఉద్యమం ద్వారా స్వరాష్ర్టాన్ని సాధించినట్లే రైతుపోరుతో వడ్ల కొనుగోలుపై కేంద్రం మెడలు వంచేలా టీఆర్ఎస్ పార్టీ బరిలోకి దిగింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరిని ప్రజల్లోకి తీసుకుపోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. రైతులను సంఘటితం చేసి బీజేపీ ప్రభుత్వం తీరును బట్టబయలు చేసేందుకు నడుం బిగించింది. ఆహారచట్టానికి తూట్లుపొడిచే విధంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీకి తగిన విధంగా బుద్ధి చెప్పేలా కార్యాచరణను టీఆర్ఎస్ అమలు చేస్తోంది. యాసంగిలో వడ్లు కొనని పక్షంలో ఈ నెల 11న చేపట్టనున్న ఢిల్లీ ధర్నాలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు. సీఎంకు మద్దతుగా అన్నదాతలు, రైతు, టీఆర్ఎస్ నాయకులంతా భారీగా తరలివెళ్లాలని ఇప్పటికే నిర్ణయించారు.
ఉభయ జిల్లాల్లో మంత్రి నిరసన
వేల్పూర్, ఏప్రిల్ 6: ధాన్యం కొనుగోళ్లపై ఉభయ జిల్లా కేంద్రాల్లో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో, 11 గంటలకు నిజామాబాద్‌లో చేపట్టనున్న మహా ధర్నాల్లో పాల్గొంటారు.
రైతుల కోపాగ్నిలో బీజేపీ మసవుతుంది..
పంజాబ్‌లో వంద శాతం పంటలు కొనుగోలు చేస్తున్నట్లే మన వడ్లను కూడా కేంద్రం కొనాలి. ప్రజల నుంచి దోచుకున్న రూ.23 లక్షల కోట్ల సొమ్ము నుంచి తెలంగాణకు రూ.12వేల కోట్లు ఇస్తే కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుంది. మంత్రులు, ఎంపీలు స్వయంగా వెళ్లి కలిసినా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఉధృతంగా పోరాడుతున్నాం. బీజేపీకి తగిన గుణపాఠం చెబుతాం. రైతుల కోపాగ్నిలో మోదీ ప్రభుత్వం మాడి మసైపోవడం ఖాయం. జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులంతా భారీగా తరలిరావాలి.
– ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
కేంద్రం కండ్లు తెరిపించాలి..
బీర్కూర్, ఏప్రిల్ 6 : నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేసేందుకు ఇసుకేస్తే కిందికి రాలనంతగా.. రైతులు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలి. మహాధర్నాల నిరసన సెగ కేంద్ర ప్రభుత్వానికి కండ్లు తెరిపించేలా ఉండాలి. తెలంగాణ రాష్ట్రమంటే బీజేపీ ప్రభుత్వానికి చిన్నచూపు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు, ప్రజలు అభివృద్ధి సాధిస్తున్నారనే అక్కసుతోనే ఇదంతా చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మహాధర్నాలకు తరలిరావాలి.
–పోచారం భాస్కర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్