నిజామాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. ఒకప్పుడు అంతంతమాత్రంగానే ధర పలికిన భూముల్లో ఇప్పుడు రియల్ బూమ్ ఊపందుకున్నది. కాళేశ్వరం, మిషన్‌కాకతీయ వంటి సాగునీటి కార్యక్రమాలతో పంటభూముల రేట్లు అమాంతం పెరిగిపోగా.. జిల్లా పునర్విభజనతో రియల్ఎస్టేట్ రంగం కొత్త ఉత్తేజాన్ని అందుకున్నది. ఫలితంగా భూములకు డిమాండ్ హెచ్చడంతోపాటు క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికీ ఆదాయం గణనీయంగా పెరిగింది. తాజా లెక్కల ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 69,578 దస్తావేజులకుగాను మొత్తం రూ.156.16కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో భూములకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండేది. సాగు భూములకు విలువే లేకపోయేది. ఇందుకు సాగుకు నోచుకోని భూములుండడమే కారణం. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి సారథిగా కేసీఆర్ వచ్చాక భూముల రేట్లు అమాంతం పెరిగాయి. కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో సాగు భూములు అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు జిల్లా పునర్విభజనతో అధికార వికేంద్రీకరణ చర్యలతోనూ రియల్ ఎస్టేట్ రంగం ఉత్తేజితమైంది. ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు చిన్నపాటి పట్టణాల్లో రియల్ భూమ్ అంతంత మాత్రంగానే ఉండేది.
ఇప్పుడు ఒక్కసారిగా చిన్న పట్టణాలు సైతం అమాంతం దూసుకెళ్తున్నాయి. ఇందుకు కామారెడ్డి చక్కని ఉదాహరణగా నిలుస్తున్నది. జిల్లా ఏర్పడక ముందు ఇక్కడ భూముల క్రయ, విక్రయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండేది కాదు. జిల్లా ఏర్పడిన తర్వాత కామారెడ్డి జిల్లా కేంద్రం ఒక్కసారిగా రియల్ రంగంలో దూసుకుపోతున్నది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లోనూ భూముల క్రయ, విక్రయాలు జోరుగా సాగుతుండగా బిచ్కుంద, దోమకొండ, ఎల్లారెడ్డిలో అత్యల్పంగా భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుండడం కనిపిస్తుంది.
70వేల దస్తావేజులు.. రూ.156 కోట్లు ఆదాయం
2021-22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, సమకూరిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.ఇందులో ఆసక్తికర అంశాలున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 69,578 దస్తావేజులకు స్టాంపు డ్యూటీ ఆదాయం రూ.114.18 కోట్లు వచ్చింది. ట్రాన్స్ఫర్ డ్యూటీ ఆదాయం రూ.23.37 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.18.61 కోట్లు వచ్చింది. మొత్తం రూ.156.16 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక దస్తావేజుకు సగటున వచ్చిన ఆదాయం రూ.22,444గా ఉన్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఉభయ జిల్లాలో 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆదాయం పెరిగింది.
ఏడాదిలో రెండు సార్లు భూముల మార్కెట్ ధరలను పెంచడంతో పలు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తక్కువ దస్తావేజులు వచ్చినప్పటికీ రుసుము రూ పంలో ఎక్కువ ఆదాయం సమకూరింది. 2014 లో చివరగా భూముల విలువలు సవరించారు. ఏడేండ్ల తర్వాత గతేడాది జూలై 22న ఒకసారి, ఈ ఏడాది ఫిబ్రవరి 1న మరోసారి విలువలు పెంచా రు. ఆదాయం రెండింతలు అయ్యింది. కరోనా ప్రభావం కూడా అంతగా లేకపోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడలేదు. ఇది కూడా శాఖకు కలిసి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కువ మొత్తంలో ఆదా యం వచ్చినా అందులో నాలుగో వంతు ఆదాయాన్ని సమకూర్చింది మాత్రం రెండు, మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే. కామారెడ్డి, నిజామాబాద్, నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో రెవెన్యూ భారీగా సమకూరింది.
భూముల ధరల్లో క్రమబద్ధీకరణ…
ఇండ్ల స్థలాలు, ప్లాట్లు బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండగా, ప్రభుత్వ రికార్డుల్లో వాటి విలువ చాలా తక్కువగా ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వానికి వాస్తవంగా రావాల్సిన ఆదాయం రావడం లేదు. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్, వినాయక్‌నగర్ ప్రాంతంలో బహిరంగ మార్కెట్లో చదరపు గజం స్థలం విలువ రూ.20వేలు నుంచి రూ.50 వేలు వరకు పలుకుతున్నది. కానీ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల ప్రకారం ఇదే ప్రాంతంలో చదరపు గజం స్థలం విలువ బహిరంగ మార్కెట్ విలువతో పోలిస్తే సగం మాత్రమే ఉంటుంది.
స్థిరాస్తి కొనుగోలు చేసిన వ్యక్తి ప్రభుత్వ ధర ప్రకారం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నందున ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోతున్నది. బహిరంగ మార్కెట్లో ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రికార్డుల్లో ధరలు నమోదు చేయడం ద్వారా హెచ్చుతగ్గులను ప్రభుత్వం సరి చేసింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలనలో వచ్చిన పెను మార్పుల మూలంగా భూములకు రోజురోజుకూ ధరలు పెరుగుతూనే ఉండడంతో సర్కారు రెండుసార్లు సవరణకు మొగ్గు చూపింది. బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ ధరలను క్రమబద్ధీకరించింది.
కామారెడ్డి టాప్…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కామారెడ్డి పట్టణం 100 కిలో మీటర్ల దూరంలో ఉంది. రైలు, రోడ్డు మార్గం సులువుగా విస్తరించి ఉంది. జాతీయ రహదారి 44 సైతం పట్టణం పక్కనుంచే పోతుండడంతో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నది. జిల్లా ఏర్పడిన అనంతర కాలం నుంచి ఇక్కడి రి యల్ వ్యాపారులు భూముల ధరలను అమాంతం పెంచేసి క్రయ, విక్రయాలను నిర్వహిస్తున్నారు. రాజధానికి దగ్గర్లో ఉందంటూ ప్రజల పెట్టుబడిని భూముల వైపు మళ్లిస్తున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు అనేక చోట్ల ఎకరానికి రూ.20లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతున్న సందర్భాలను చూస్తున్నాం.
కామారెడ్డి, నిజామాబాద్ వాసుల కన్నా ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారస్తులు ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను ఇబ్బడి ముబ్బడిగా కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది సబ్ రిజిస్ట్రార్లే వీరందరికీ మధ్యవర్తులుగా నిలిచి వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలన్నట్లుగా నిర్వహిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులతో చేతులు కలుపుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది నేరుగా రియల్ రంగంలో పాత్రధారులవుతున్నారు. దీనికి తోడుగా స్థానిక రియల్ వ్యాపారులు సైతం వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతుండడం మూలంగా అమాంతం భూముల క్రయ, విక్రయాలు పెరుగుతుండడం కనిపిస్తున్నది.