నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 6 : బంగారు తెలంగాణ సాధనలో భాగంగా దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద మంజూరైన వివిధ యూనిట్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, యూనిట్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. లబ్ధిదారులు ఆసక్తితో ఎంచుకున్న యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని సూచించారు.
రైతులు, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధి కోసం రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, పంటలకు ఉచిత కరెంటు, అసరా పింఛన్లు, దళితబంధు వంటి పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈగ సంజీవ్‌రెడ్డి, గడీల రాములు, కోర్వ దేవేందర్, ప్రేమ్దాస్నాయక్, బొల్లెంక గంగారెడ్డి, భూపాల్, అన్నం సాయిలు పాల్గొన్నారు.