కామారెడ్డి, జూన్ 20 : ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 125మంది ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 317 జీవోను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ కొంతమంది కొత్త జిల్లాలకు బదిలీ అయ్యారు. పరస్పర బదిలీలకు అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు విన్నవించుకు న్నాయి. ఉపాధ్యాయ సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,558 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరులోగా ప్రమోషన్ల ప్రక్రియ చేపడతామని ఉపాధ్యాయ సంఘాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో 76, నిజామాబాద్ జిల్లాలో 49 మంది పరస్పర బదిలీలకు అంగీకార పత్రాలను ప్రభుత్వానికి అందించారు. నిజామాబాద్ జిల్లాలో 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 29 మంది ఎస్జీటీలు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.
విద్యాశాఖలో మొదలైన కసరత్తు…
రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం 317 జీవో ప్రకారం కేడర్ స్ట్రెంథ్ను అనుసరించి ఉపాధ్యాయుల కేటాయింపుల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. గతంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలుండగా, ప్రస్తుతం నూతన జిల్లాలో కొత్త విభాగాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను ఇటీవల రూపొందించారు.
నెలరోజుల క్రితం సీనియారిటీ జాబితా విషయంలో అభ్యంతరాలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతూనే మరోవైపు దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లపై దృష్టి సారించింది. అందులో భాగంగా మొదటి విడుతగా రాష్ట్రవ్యాప్తంగా పరస్పర బదిలీలకు అవకాశం కల్పించింది. ప్రమోషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో భాగంగా విద్యాశాఖ అధికారులు ఆ ప్రక్రియను వేగవంతం చేశారు. వివిధ శాఖలో సీనియారిటీ ప్రాతిపదికన జాబితాలను తయారు చేసి ఉన్నతాధికారులకు అందించారు. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.