కామారెడ్డి/విద్యానగర్, జూన్12: వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపిన విద్యార్థులు చదువుల తల్లి ఒడిలోకి వస్తున్నారు. ఇందుకోసం కామారెడ్డి జిల్లాలోని విద్యాసంస్థలు సిద్ధమయ్యయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం ప్రారంభం అవుతాయి. బడిబాట కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1,240 మంది కొత్త విద్యార్థులు చేరినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశ పెట్టడం, మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటుండంతో సర్కార్ బడులకు మరింత ఆదరణ పెరుగుతోంది. మధ్యాహ్న భోజనం, దుస్తులు, పుస్తకాలు అందజేస్తుండడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకొస్తున్నారు.
30 వరకు బ్రిడ్జి కోర్సు
పాఠశాలలో ఈనెల 13 నుంచి 30వ తేదీ వరకు బ్రిడ్జి కోర్సు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బ్రిడ్జి కోర్సులో భాగంగా పై తరగతులకు ప్రమోట్ అయిన విద్యార్థి, కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను చదివించేందుకు ఈ కోర్సును నిర్వహించనున్నారు. జూలై 1వ తేదీ నుంచి విద్యార్థులకు రెగ్యులర్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. బ్రిడ్జి కోర్సులో భాగంగా డిజిటల్ పాఠ్యాంశాలతోపాటు ముఖాముఖి తరగతులను నిర్వహించనున్నారు. ఒకటి, రెండు తరగతులను మినహాయించి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నాలుగు దశలుగా విభజించి రోజుకు ఆరు పీరియడ్స్ చొప్పున పాఠ్యాంశాలను బోధిస్తారు. తరగతుల వారీగా బోధించాల్సిన పాఠ్యాంశాల షెడ్యూల్‌ను విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసింది. టీశాట్ విద్య చానల్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహించనున్నారు. జూలై1వ తేదీ నుంచి ఉపాధ్యాయులు ఆయా పాఠ్యాంశాలను తరగతి గదిలోనే బోధించనున్నారు. సర్కారు ముందుగా ప్రకటించిన విధంగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు బోధించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
కొనసాగుతున్న బడిబాట..
ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు అడుగులు వేస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ నిర్వహిస్తోంది. కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్ల పాటు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది ఎలాంటి అడ్డంకులూ లేకపోవడంతో బడిబాట విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్ల నుంచి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్నారు.
బడుల బలోపేతంపై సర్కారు దృష్టి
సర్కార్ బడుల బలోపేతానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మన ఊరు-మన బడి, మనబస్తీ-మనబడి కార్యక్రమాన్ని రూపొందించి రూ.7,239 కోట్లను ఖర్చు చేస్తున్నది. జిల్లాలో 99 పాఠశాలలకు కూ.కోటి ఒక లక్ష నిధులు మంజూరయ్యాయి. మరికొన్ని పాఠశాలలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు ఇంజినీరింగ్ అధికారులతో ఎస్టీమెట్స్ తయారు చేస్తున్నారు. పాఠశాలల్లో 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 14వ తేదీన ఆంగ్ల మాధ్యమం ప్రారంభంపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. 15వ తేదీన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం, 16న స్కూల్ మెనేజ్ మెంట్ కమిటీల సమావేశం, 17న స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాఠశాలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. 18న బాలికల విద్య, కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
20న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం వేడుకులు నిర్వహిస్తారు. 21న స్వచ్ఛ పక్షోత్సవం, 22న హరితహారం, 23న ప్రత్యేక ఆవాసాల్లోని పిల్లల పేర్ల నమోదు, 24న పాఠశాలలో బాలసభ ఏర్పాటు చేయనున్నారు. చదువుల మేళా పేరుతో 25న గ్రంథాలయ దినాన్ని ఆచరించడం, 27న బడి బయట ఉన్న విద్యార్థుల పేర్ల నమోదు, 28న ద్విభాష పుస్తకాలపై, 29న డిజిటల్ విద్యపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 30వ తేదీన గణితం, సైన్స్ డేలను నిర్వహించేలా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 1,011 పాఠశాలలకు గాను 697 ప్రాథమిక పాఠశాలలు, 127 యూపీఎస్‌లు, 181 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 4,946 మంది ఉపాధ్యాయలకు గాను ప్రస్తుతం 4,089 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మొదటి విద్యాసంవత్సరం 2022-23లో 33శాతం పాఠశాలలను మనఊరు-మనబడి పథకం కింద ఎంపిక చేశారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, మేధావులు, దాతలను భాగస్వామ్యులుగా చేస్తున్నారు.
పాఠశాలలు సిద్ధం
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. అన్ని పాఠశాలలను శుభ్రం చేశారు. సోమవారం నుంచి అన్ని పాఠశాలలు ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.