కామారెడ్డి, జూన్ 7: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్నిపత్రికలు, ప్రతిపక్షాలు అక్కసును వెల్లగక్కుతు న్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయ డం లేదంటూ, బకాయిలు ఉన్నాయంటూ తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అభివృద్ధిలో టాప్-20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవే 19 ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఉండగా అందుకు విరుద్ధంగా తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు ఆంధ్రా పత్రికలు, మరోవైపు ప్రతిపక్షాలకు రాష్ట్రంలోని పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి మాత్రం కనబడకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ నెల 5వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో లక్షల్లో బకాయిలు, ఒక్కో పంచాయతీకి రూ.10-20 లక్షల బకాయిలు అంటూ వార్త కథనం వెలువడింది.
గాంధారి మండలం రాంలక్ష్మణ్‌పల్లి పంచాయతీలో రూ.36లక్షల నిధులు ఖర్చు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.19లక్షలే అంటూ వార్త కథనం వచ్చింది. రూ.17లక్షలు పెండింగ్‌లో ఉన్నాయంటూ వచ్చిన కథనంపై రాంలక్ష్మణ్ పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం, మండల పరిషత్ అధికారులు స్పందించారు. రాంలక్ష్మణ్ పల్లి గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి జీపీ నిధులు, ఉపాధి హామీ పనుల రికార్డులను పరిశీలించగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం వాస్తవ విరుద్ధంగా ఉన్నదని పంచాయతీ పాలకవర్గం మంగళవారం లేఖ విడుదల చేసింది. గ్రామపంచాయతీల అభివృద్ధికి పలు పథకాల ద్వారా లక్షలాది రూపాయల నిధులు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలకు తోడు పత్రికలు, ప్రతిపక్షాలు తయారయ్యారని ఆరోపిస్తున్నారు.
నిధుల వివరాలు ఇవే…
గాంధారి మండలం రాంలక్ష్మణ్ పల్లి గ్రామానికి ఏప్రిల్ 1, 2021 సంవత్సరం నుంచి జూన్ 5, 2022 వరకు జీపీ రికార్డుల ప్రకారం నిధులు వివరాలు ఇలా ఉన్నాయి. రాంలక్ష్మణ్‌పల్లి పంచాయతీ సొంత నిధులు రూ.1,24,232 రాగా, రూ.1,10,360 ఖర్చు చేశారు. మిగతా రూ.13,872 జమ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.7,91,182 రాగా, రూ.6,98,707 ఖర్చు చేయగా రూ.92,475 గ్రాంట్ మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.4,05,472 విడుదల కాగా, రూ.3,89,732 వివిధ పనులకు ఖర్చు చేశారు. ఇందులో రూ.15,740 నిల్వ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.13,20,886 విడుదల కాగా, రూ.11,98,799 వివిధ పనులకు గాను ఖర్చు చేశారు. రూ.1,22,087 ప్రస్తుతం పంచాయతీ ఖాతాల్లో నిల్వ ఉన్నట్లు గాంధారి మండల పంచాయతీ అధికారి రాజ్‌కిరణ్ రెడ్డి వెల్లడించారు. దీనిపై రాంలక్ష్మణ్‌పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ లాండి రాధాబాయి రాంచందర్‌రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శిరీశ్ నిధులపై వచ్చిన కథనాన్ని ఖండించారు. గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, గ్రామపంచాయతీ ఫండ్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లకు సంబంధించిన వివరాల కాపీలను, అకౌంట్ల వివరాలను పరిశీలించి విడుదల చేశారు. తమ గ్రామంలో పెండింగ్ బిల్లులు లేవని, మిగులు నిల్వ పంచాయతీ ఖాతాలో ఉన్నాయని స్పష్టం చేశారు. గ్రామంలో గాంధారి మండల పరిషత్ అధికారులు పర్యటించి వార్త కథనానికి సంబంధించిన వివరాలపై ఆరా తీయగా అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు.