కామారెడ్డి, ఏప్రిల్ 16: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున తల్లీకొడుకులు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్య చేసుకున్న తల్లీకొడుకులు మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన గంగం పద్మ (63), గంగం సంతోష్ (42)గా గుర్తించారు. ఈ ఘటనకు ముందు సోషల్ మీడియాలో తమ మరణానికి కారణమైన వారి గురించి బాధితులు విడుదల చేసిన వీడియో కలకలం రేపుతున్నది. రామాయంపేటకు చెందిన మున్సిపల్ చైర్మన్, మరో ఐదుగురు వ్యక్తులు, ఓ పోలీసు అధికారి వేధింపులతోనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్లేఖలోనూ వారు స్పష్టంచేశారు. తల్లీకొడుకుల ఆత్మహత్యకు కారణమైన ఏడుగురిపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన కామారెడ్డి పట్టణ పోలీసులు.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతామని పోలీసులు స్పష్టంచేశారు.
పోలీసుల కథనం ప్రకారం..
మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన గంగం పద్మ -గంగం అంజయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ ఇల్లరికం వెళ్లగా, రెండో కుమారుడు శ్రీధర్ స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు గంగం సంతోష్. భాగస్వాములతో కలిసి రామాయంపేటలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అంజయ్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతడిని దవాఖానలో చూపించేందుకు పద్మ, సంతోష్ ఈనెల 11న కామారెడ్డికి చేరుకున్నారు. స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలోని 203 నంబరు రూములో బస చేశారు. అదేరోజు అంజయ్యను దవాఖానలో చూపించి స్వగ్రామానికి పంపించారు. ఆ రోజునుంచీ తల్లీకొడుకులు లాడ్జిలోనే ఉంటున్నారు. 12న రామారెడ్డిలోని కాలభైరవస్వామిని దర్శించుకున్న తల్లీకొడుకులు.. 13న బాసర వెళ్తున్నామని తొలుత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
శుక్రవారం రాత్రి 10గంటలకు రామాయంపేటలో ఉన్న సోదరుడు గంగం శ్రీధర్‌కు సంతోష్ ఫోన్ చేశాడు. ఆరుగురు వ్యక్తులు, ఓ పోలీసు అధికారి వేధిస్తున్నారని, తాము ఆత్మహత్య చేసుకోబోతున్నామని చెప్పాడు. కుటుంబసభ్యులు వారించడంతో ఆగిపోయిన వారు.. శనివారం తెల్లవారుజామున 5.30గంటల ప్రాంతంలో అన్నంతపనీ చేశారు. తెల్లవారుజామున లాడ్జి గదిలోనుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన స్థానికులు, లాడ్జి నిర్వాహకులు అగ్నిమాపక అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గంగం పద్మ, సంతోష్ పూర్తిగా సజీవదహనమయ్యారు. గది తలుపులు బిగించుకున్న వారు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారని కామారెడ్డి పట్టణ సీఐ నరేశ్ తెలిపారు. గదిలోని గోడలు, ఫర్నిచర్, ఏసీ సైతం మంటలకు కాలిపోయాయి.
ఆ ఏడుగురు వేధించారు..!
ఏడుగురు వ్యక్తులు తమను వేధించారని, ఏడాదిన్నరగా నరకయాతన అనుభవించామని పేర్కొంటూ ఆత్మహత్యకు ముందు పద్మ, సం తోష్ ఓ సెల్ఫీ వీడియోను ఫేస్బుక్లో పోస్టుచేశారు. ‘రామాయంపేటకు చెందిన ఏడుగురు వ్య క్తుల కారణంగా 18నెలలుగా నాకు, నా కుటుంబసభ్యులకు మనశ్శాంతి లేకుండాపోయింది. ఫే స్‌బుక్‌లో ఓ వ్యక్తి పెట్టిన పోస్టుకు నేనే కారణమంటూ వాళ్లు నన్ను టార్గెట్ చేసిండ్రు. మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఐరేని పృథ్వీగౌడ్, తోట కిరణ్, కన్నాపురం కిష్టాగౌడ్, సరాఫ్ స్వరాజ్‌తోపాటు గతంలో రామాయంపేటలో పనిచేసి ప్రస్తుతం తుంగతుర్తి సీఐగా ఉన్న నాగార్జునగౌడ్ మమ్మల్ని వేధించారు. వాళ్ల కారణంగా నా ఆస్తు లు పోయాయి.
డబ్బులూ నష్టపోయాను. చివరికి అప్పులపాలైనా నన్ను వాళ్లు వదలిపెట్టలేదు. అప్పటికీ నేను తట్టుకోగలిగాను. వాళ్లు వ్యక్తిగతం గా నన్ను ఇబ్బందిపెట్టాలని చూశారు. సీఐ నాగార్జునగౌడ్ ద్వారా పల్లె జితేందర్‌గౌడ్ నా ఫోన్ లా క్కుని డేటాను తీసుకుని మమ్మల్ని వేధించడం ప్రారంభించారు. దీనిపై డీజీపీ వరకు కంప్లయిం ట్ చేసిన. ఇప్పటికి 108 రోజులైంది. రాజకీయ నాయకులకు ఫిర్యాదుచేశాను. అయినా న్యా యం జరుగకపోగా.. వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. మా కుటుంబమంతా బాగా డిస్టర్బ్ అయ్యింది. వీళ్లకారణంగా నేను, అమ్మ చనిపోదామని నిర్ణయించుకున్నాం. కుటుంబసభ్యులు బాధపడుతారని తెలిసినా.. ఏమీ చేయలేక ఈ నిర్ణయానికి వచ్చాం. మేము పోయిన తర్వాతైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా..’ అంటూ సంతోష్ సెల్ఫీవీడియోలో పేర్కొన్నారు. ‘జితేందర్ చిన్నప్పటినుంచీ నా కొడుకు దోస్తి. సంతోష్ ఏం చేయకపోయినా.. పోలీసులకు పట్టించిండు. ఫోను గుంజుకుని పదిరోజులు దగ్గరపెట్టుకున్నరు. మావాడిని జైళ్ల ఏపిచ్చిండు. ఇప్పటికీ ఇంకా బెదిరిస్తనే ఉన్నరు. అందరినీ ఇడిసిపెట్టి పోతున్నం. మేం పోయినంక.. మమ్మల్ని వేధించినోళ్లను అందరూ చూస్తుండగా పోలీసులు పట్టుకుపోవాలె..’ అని పద్మ సూసైడ్ వీడియోలో ఆవేదన వ్యక్తంచేసింది. ఫేస్బుక్లో ఓ ప్రజాప్రతినిధి కుమారుడికి సంబంధించి సంతో ష్ పోస్టు పెట్టాడంటూ మొదలైన వివాదం నానాటికీ తీవ్రమవుతూ వచ్చిందని తెలుస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంతోష్‌ను భూ ములు అమ్మే విషయంలో రూ.50లక్షలు ఇవ్వాలంటూ నిందితులు వేధించడం ప్రారంభించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఏడుగురిపై కేసు నమోదు
మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఏడుగురిపై పోలీసులు సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. తల్లి, తమ్ముడి మృతికి కారణమంటూ గంగం శ్రీధర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఐరేని పృథ్వీగౌడ్, తోట కిరణ్, కన్నాపురం కిష్టాగౌడ్, సరాఫ్ స్వరాజ్‌తోపాటు తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నరేశ్ తెలిపారు. మృతుడు సంతోష్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కోసం మిగతా సాక్షులనూ విచారిస్తామని, రామాయంపేట పోలీసుల సహకారంతో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికను సైతం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.