కామారెడ్డి/సదాశివనగర్, ఏప్రిల్ 12 : కామారెడ్డి మున్సిపల్‌తోపాటు జిల్లాలోని 319 గ్రామాల్లో భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తున్నట్లు మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లాలోని సదాశివనగర్, గాంధారి మండలాల్లోని మల్లుపేట, దగ్గి, కల్వరాల్ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో నీటి సరఫరా తీరుపై అడిగి తెలుసుకున్నారు. గడపగడపకూ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. ఎక్కడా తాగునీటి బిల్లులు వసూలు చేయవద్దని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీవో కాపీలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. భగీరథ నీటిని రెండు పూటలా సరఫరా చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో ఫిల్టర్ వాటర్ కన్నా మిషన్ భగీరథ నీరు మెరుగైందన్నారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు వస్తుందా అని గ్రామస్తులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరాలో లోటుపాట్లు, ఏ విధంగా మెరుగుపర్చుకోవాలనే విషయాలను తెలుసుకున్నారు. జిల్లాలో మిషన్‌భగీరథ నిర్వహణపై సీఈ సంతృప్తివ్యక్తం చేశారు. సీఈ వెంట కామారెడ్డి జిల్లా మిషన్ భగీరథ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ రమేశ్, ఏఈ శ్రీధర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఉన్నారు.