కామారెడ్డి, ఏప్రిల్ 11 : ఆస్తి పన్ను వసూలుకు బల్ది యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెండింగ్లో లేకుం డా రెగ్యులర్గా ఆస్తిపన్ను కట్టే వారికి రాయితీలు కల్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ ప్రకటించడం తో గృహ వినియోగదారులు, వ్యాపార వాణిజ్య సముదాయాల యజమానులు ఆస్తిపన్ను చెల్లించేందుకు ముం దుకు వస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5శాతం మినహాయింపును ఇస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలో మూ డు మున్సిపాలిటీలు ఉండగా వాటిలో పన్నుల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి బల్దియాల్లో పన్నుల వసూళ్లపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇందు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టణవాసులు రిబేట్ పొందేలా చర్యలు చేపడుతుండడంతో పన్ను వసూళ్లు పెరుగుతున్నాయి.
విస్తృతంగా ప్రచారం…
జిల్లా పరిధిలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ము న్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణకు వచ్చే బండ్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది, బిల్ కలెక్టర్లు కాలనీల్లో ఇంటింటికీ వెళ్తూ పన్నులు చెల్లించి రిబేట్ అవకాశాన్ని పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి వద్దనే ఆన్లైన్ ద్వారా గానీ నగదు రూపంలో గానీ పన్నులు చెల్లించే విధంగా ప్రజలకు ఆవగాహన కల్పిస్తున్నారు. కరపత్రాల పంపిణీ, ఆటోల ద్వారా ప్రచా రం నిర్వహిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను చెల్లించే వారికి 5శాతం రిబేట్ వర్తిస్తుండగా, పాతబకాయిలు 2021-22 వరకు చెల్లించిన వారే 5శాతం రిబేట్కు అర్హులు అవుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల అమలు దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు గడువు ప్రకటించిందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
ఆన్లైన్లో చెల్లింపులకు చర్యలు…
రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో పన్నులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. డిజిటల్ సేవలు ఇప్పటికే మున్సిపల్ శాఖలోని వివిధ విభాగాల్లో అమలవుతుండగా పన్నుల చెల్లింపులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వినియోగదారులకు పన్నులు చెల్లించడం మరింత సులువుగా మారింది. డిజిటల్ చెల్లింపులకు పట్టణ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కాగా, ప్రభుత్వం పన్నుల వసూళ్లను ప్రారంభించింది. మొబైల్ ఫోన్లో క్యూఆర్ కోడ్, స్కాన్, ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ, ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర సర్వీసుల ద్వారా నేరుగా మున్సిపాలిటీకి చెందిన సంబంధిత బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
సీడీఎంఏలో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే జిల్లా పేరు, మున్సిపాలిటీ వస్తుంది, ఆ తర్వాత వార్డ్డు, ఇంటి నంబర్ టైప్ చేస్తే ఆస్తిపన్ను ఎంత చెల్లించాల్సి ఉందో తెలియపరుస్తుంది. ఆ తర్వాత నేరుగా నగదును బదిలీ చేస్తే వెంటనే సంబంధిత మున్సిపాల్టీ ఖాతాలోకి జమవుతుంది. దీంతో మున్సిపల్ అధికారులు, బిల్ కలెక్టర్ల అటు వినియోగదారుల సమయం ఆదా అవుతున్నది. గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి సరికొత్త ఆలోచనలతో మున్సిపల్ శాఖ పన్నుల వసూళ్లకు వివిధ రకాల ప్రణాళికలతో ముందు కు సాగుతున్నారు. అందులో భాగంగానే 2021-22 ఆర్థిక సంవత్సరంలో వడ్డి రాయితీ ప్రకటించి వంద శాతం పన్నులు వసూలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి గృహం, వాణిజ్య సముదాయానికి చెందిన పన్ను మొత్తంలో 5 శాతం రాయితీ అవకాశం వస్తుంది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పన్ను వసూళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 5శాతం రాయితీ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆవకాశం కల్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటి, వాణిజ్య సముదాయాలకు సంబంధించి ఆస్తి పన్ను చెల్లించినట్లయితే 5శాతం రాయితీ ఆవకాశం కల్పించారు. ఈ ఆవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి
-దేవేందర్, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి