నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 6 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ మహిళాబంధు సంబురాలను జిల్లాలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటాలు, కటౌట్లకు మహిళలు రాఖీలు కట్టి కృతజ్ఞతాభావం వ్యక్తంచేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సన్మానించారు.
మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామంలో నిర్వహించిన మహిళాబంధు వేడుకలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరై మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు, జడ్పీటీసీ రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్‌చంద్రం ఆధ్వర్యంలో మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు.
మద్నూర్ మండలంలోని డోంగ్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని మాట్లాడారు. ఆడబిడ్డల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యురాలు శ్వేత.. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కటౌట్‌కు మహిళలు రాఖీలు కట్టారు. కొవిడ్ ఉధృతి సమయంలో ఉత్తమ సేవలందించిన వైద్యసిబ్బంది, మహిళా పారిశుద్ధ్య కార్మికులను మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఘనంగా సన్మానించారు.
నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పీహెచ్సీ మహిళా ఉద్యోగులను ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ బోయిని రాధ, జడ్పీటీసీ సభ్యుడు మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య సన్మానించారు. జలాల్పూర్లో సర్పంచ్ కృష్ణ, మాటూర్‌లో కృష్ణారెడ్డి, గోపాల్‌పేట్‌లో వంజరి సునీత, నాగిరెడ్డిపేట్లో కిచ్చయ్యగారి సునీతారెడ్డి, ధర్మారెడ్డిలో శ్రీధర్‌గౌడ్, వదల్‌పర్తిలో ప్రవీణ్ గ్రామ పంచాయతీ సిబ్బంది, మహిళా ఉద్యోగులను సన్మానించారు.
లింగంపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం చిత్ర పటానికి ఎంపీపీ గరీబున్నీసా బేగం, సర్పంచ్ లావణ్యతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు రాఖీలు కట్టారు. అనంతరం నాయకులు ఎంపీపీ, సర్పంచ్‌ను సన్మానించారు.
పెద్దకొడప్గల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ దేశాయ్ ఆధ్వర్యంలో మహిళా సర్పంచులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను సన్మానించారు. లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ చంద్రాబాయి, ఉపసర్పంచ్ శిల్ప, ఎంపీటీసీ సభ్యురాలు హీరాబాయితోపాటు అంగన్వాడీ టీచర్లు, వార్డుసభ్యులను గ్రామస్తులు సన్మానించారు.
పిట్లం మండలకేంద్రంలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ కవితావిజయ్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీబాయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశవర్కర్లు, అంగన్వాడీ ఆయాలను సన్మానించి చీరలను అందజేశారు.
బిచ్కుంద మార్కెట్ కమిటీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి జడ్పీటీసీ సభ్యురాలు భారతి రాఖీ కట్టారు. అనంతరం వైద్యసిబ్బంది, మహిళా ప్రజాప్రతినిధులను ఎంపీపీ అశోక్ పటేల్ సన్మానించారు.
గాంధారి మండల కేంద్రంలో ఎంపీపీ రాధాబలరాంతో పాటు ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లను జడ్పీటీసీ సభ్యుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సన్మానించారు.
బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల్లో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు మహిళలు రాఖీలు కట్టారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు, ఆశవర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు, ఏఎన్ఎంలను సర్పంచ్ వెంకటరమణారావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
బీర్కూర్ పీహెచ్సీ వద్ద స్టాఫ్‌నర్స్ మహమ్మదీ, ఏఎన్ఎం రుక్మిణి, ఆశ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులను ఎంపీపీ తిలకేశ్వరి రఘు ఆధ్వర్యంలో సన్మానించారు.
బాన్సువాడ పట్టణంలో ‘థాంక్యూ కేసీఆర్’ అక్షర క్రమంలో మహిళలు మానవహారం నిర్వహించారు.
కామారెడ్డి మండలంలోని దేవునిపల్లి, లింగాపూర్, చిన్నమల్లారెడ్డి గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు. చిన్నమల్లారెడ్డిలో ఆశవర్కర్లు, అంగన్వాడీ సిబ్బందిని ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
భిక్కనూర్‌లో సర్పంచ్ తునికి వేణు, ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మ నాగభూషణం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఊరేగింపు నిర్వహించారు.
బీబీపేట్ మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ‘థాంక్యూ కేసీఆర్’ అక్షర క్రమంలో మానవహారం నిర్వహించారు.