విద్యానగర్, మార్చి 6 : రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని విప్ గంప గోవర్ధన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను ప్రారంభించారన్నారు. మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు. దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేసీఆర్‌కు ఆడపడుచులందరూ రాఖీలు కట్టి ఆశీర్వదించాలని కోరారు. ఆడపిల్ల పుట్టిన నుంచి వివాహం అయ్యేంత వరకు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని అన్నారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు కేసీఆర్ చిత్ర పటానికి రాఖీలు కట్టారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.