రోజుకు రెండు గంటలు కూడా అందని నెట్వర్క్
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు తప్పని ఇబ్బందులు
సిరికొండ, ఆగస్టు 27 : మారుముల గ్రామాలకు మొబైల్ సేవలందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్(భారత సంచార్ నిగం లిమిటెడ్) టవర్లు నేడు సక్రమంగా పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని చీమన్‌పల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో 2007లో మొబైల్ సేవలు అందించడానికి టవర్ ఏర్పాటు చేయడంతో అక్కడి ప్రజలు చాలా ఆనంద పడ్డారు. టవర్ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో ప్రజలు చాలామంది బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను తీసుకున్నారు. ప్రతి ఇంటిలో రెండు నుంచి మూడు కనెక్షన్లు తీసుకొని మొబైల్ సేవలకు అలవాటు పడిపోయారు. వ్యవసాయ పనుల్లో సైతం మొబైల్ సేవలను విని యోగించుకుంటున్నారు. చీమన్‌పల్లి టవర్ సేవ లు పందిమడుగు, చీమన్‌పల్లి, తాటిపల్లి, జినిగ్యాల్, పాకాల ప్రజలు వినియోగించుకుంటున్నా రు. కాగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే సెల్ సిగ్నల్ కూడా నిలిచిపోతుంది.సిగ్నల్ రాక ప్రజలు తమ బంధువులకు గాని, దూరాన ఉండే కుటుంబ సభ్యులతో గాని మాట్లాడలేక పోతున్నారు. క్షేమ సమాచారం అందుకోలేక పోతున్నారు. మాట్లాడుతుండగానే కరెంట్ పోతే సిగ్నల్ కట్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటరీలు కూడా పనిచేయక పోవడంతో బీఎస్ఎన్ఎల్కు అలవా టు పడిన వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీఎస్ఎన్ఎల్ అధికారులు టవరు సేవల ను ప్రజలకు అందించడంలో విఫలమవ్వడంతో గ్రామస్తులు ప్రైవేటు నెట్వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారు. మూడు సంవత్సరాలైనా బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగదారులకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చీమన్‌పల్లిలో విద్యుత్ సప్లయ్ నిలిచిపోతే చాలు సిగ్నల్ నిలిచిపోతున్నది. మళ్లీ కరెంటు వచ్చిన తర్వాత సైతం గంట వరకు సిగ్నల్ రావడం లేదంటున్నారు. మొత్తం మీద రోజంతా రెండు గంటల పాటు సిగ్నల్ వస్తే మహాగొప్ప అని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జనరేటర్ వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు బ్యాటరీ బ్యాకప్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
బీఎస్ఎన్ఎల్ సేవలందక ఇబ్బందులు
అత్యవసరంగా ఎవరికైనా ఫోన్ చేయాలంటే సమస్య తలెత్తుతున్నది. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న మా గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్ వేశారంటే ఎంతో సంతోషించాం.. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కరెంటు ఉంటేనే సిగ్నల్ వస్తుంది. అధికారులు స్పందించి తక్షణమే సేవలు మెరుగు పరచాలి.
-నరేశ్,చీమన్‌పల్లి, వినియోగదారుడు
త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం
మండలంలోని చీమన్‌పల్లి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నెట్వర్క్ అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమే. బ్యాటరీ సమస్య ఉంది. సంస్థకు బ్యాటరీలు కావాలని కోరాం. త్వరలోనే బ్యాటరీలను అమర్చి సమస్యను పరిష్కరిస్తాం. వినియోగదారులకు అంతరాయం లేని సేవలను అందిస్తాం.
-నవీన్, ఏఈ (బీఎస్ఎన్ఎల్)