ఆత్మీయతకు ప్రతీక రాఖీ
శ్రావణ పూర్ణిమ వేళసోదరులకు రక్షగా..
నేడు రక్షాబంధన్ మార్కెట్లో జోరుగా విక్రయాలు
కొవిడ్ తగ్గుముఖంతో కొనుగోళ్లపై ఆసక్తి
రెండేండ్ల తర్వాత కిటకిటలాడుతున్న మార్కెట్లు
అన్నాచెల్లెళ్ల ప్రేమబంధం.. సోదర ప్రేమకు సంకేతం.. రాఖీ పౌర్ణమి. అక్కాచెల్లెళ్లు సోదరునికి రాఖీ కట్టి పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటారు. జీవితాంతం, కంటికిరెప్పలా సంరక్షిస్తూ వారికి తోడుగా ఉంటామని భరోసా ఇస్తారు సోదరులు. అనుబంధం, ఆత్మీయ ఆసరా కలగలిసిన రాఖీపౌర్ణమి నేడు. ఈ నేపథ్యంలో శనివారం కొనుగోలుదారులతో మార్కెట్లు కిటకిటలాడాయి. కరోనా నేపథ్యంలో గతేడాది మందగించినప్పటికీ, ఈసారి కొనుగోళ్లు మళ్లీ పుంజుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
హిందూ సంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది రాఖీ పౌర్ణమి. ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ, రక్షాబంధన్ అని పిలుస్తారు. రక్ష అనగా సంరక్షణ అని అర్థం. దీంతోపాటు జంధ్యధారణకు ప్రత్యేకత ఉన్నది. ఈ రోజున నూతన జంధ్యాన్ని ధరించడం ద్వారా దివ్యమైన తేజస్సు లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయతను, అనుబంధాన్ని చాటి చెప్పే రాఖీ పండుగ అత్యంత ప్రత్యేకమైనది. ఈ పండుగ రోజున సోదరీమణులు, వారి సోదరులకు రాఖీలను కట్టి ఆత్మీయతను చాటి చెబుతా రు. రాఖీని కట్టుకున్న తర్వాత సోదరీమణులకు బహుమతుల ద్వారా తమ ప్రేమను చాటుతారు. ఆదివారం నాడు రాఖీ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు.
పండుగ విశిష్టత..
ఇతిహాసాల ప్రకారం ద్రౌపది-శ్రీకృష్ణుడిది అన్నాచెల్లెళ్ల బంధం. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీ కృష్ణుడి చూపుడు వేలికి రక్తం ధారగా కారుతుందట, అది గమనించిన ద్రౌపది తన చీర కొంగును చించి వేలికి కట్టింది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుంచి ఆమెను కాపాడుతాడు. భవిష్యత్తు పురాణంలో ఈ పండుగ ప్రస్తావన కనబడుతుంది. పూర్వకాలంలో రాక్షసులు, దేవతల చేతిలో ఓడిపోయారు. తమ గురువైన శుక్రాచార్యుని దగ్గరకు వెళ్లి తమ విషాదాన్ని చెప్పుకున్నారు. దానికంతటికి కారణము రక్షబంధనము అందుకే వారు విజేయులైనారని తెలుసుకుంటారు. రాక్షసుల చేతిలో ఓడిపోయిన దేవతల రాజు ఇంద్రుడు తన పరివారముతో అమరావతికి వెళ్లి తలదాచుకున్నాడు. తన భర్త నిస్సహాయతను గమనించి శచీదేవి తగిన ఉపాయాన్ని ఆలోచిస్తున్న సమయంలో రాక్షసులు అమరావతిని కూడా ఆక్రమిస్తున్నారన్న విషయాన్ని గ్రహించి తన భర్తలో సమరోత్సాహాన్ని పురికొల్పింది. సరిగ్గా అదేరోజు శ్రావణ పౌర్ణిమ అవడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి తన భర్తకు రక్షను కడుతుంది. పిదప ఇంద్రుడు రాక్షసులను ఓడించి మూడు లోకాల్లో ఆధిపత్యాన్ని పొందాడు. ఆనాడు శచీదేవి ప్రారంభించన ఆ రక్షాబంధన ఉత్సవమే నేడు రాఖీ పండుగగా ఆచారమైనది.
ధరించే విధానము..
శ్రావణ పౌర్ణిమ పండుగ రోజు తలంటు స్నానము చేసి ముందుగా దేవతలు, తల్లిదండ్రులను పూజించాలి. మధ్యాహ్న సమయంలో రక్షను సిద్ధం చేసుకొని స్త్రీలు గృహ మధ్యలో అలికి పీట వేసి తమ సోదరులను కూర్చోబెట్టి రక్షను కట్టాలి. అలా కట్టేముందు నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా.. మనందరం దేశానికి రక్షా అనుకుంటూ ఆ బంధాన్ని కట్టాలి.
కొనుగోళ్లు పెరిగాయి..
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి గిరాకీ పెరిగింది. కరోనా మూలంగా ప్రజలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. రెండేండ్ల క్రితం కొన్నట్లు ఇప్పుడు కొంటున్నారు. ఒక్కొక్కరూ 10 నుంచి 15 రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. మా వద్ద రూ.10 నుంచి 200 వరకు విలువజేసే రాఖీలు అందుబాటులో ఉన్నాయి.
భలే గిరాఖీ
ఉమ్మడి జిల్లాలో రాఖీ కొనుగోళ్ల సందడి నెలకొన్నది. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా ఇండ్లలోంచి బయటికి రాని ప్రజలు పండుగలను అంతగా జరుపుకోలేదు. ప్రస్తుతం కరోనా నుంచి ఉపశమనం లభించడంతో మార్కెట్లో రాఖీ పండుగ సందడి కనబడుతున్నది. నేడు (ఆదివారం) రాఖీ పండుగ ఉండడంతో అక్కాచెల్లెళ్లు రాఖీల కోసం మార్కెట్లో శనివారం బారులుతీరారు. వ్యాపారులు సైతం వివిధ రకాల రాఖీలను అందుబాటులోకి తెచ్చారు. సాధారణ రాఖీల ధరలు రూ.10 నుంచి రూ.200 వరకు ఉన్నాయి. మ్యూజిక్, బల్బులు ఉన్న రాఖీలను రూ.200 నుంచి రూ.600వరకు విక్రయిస్తున్నారు. మనస్సును దోచే ఆకృతుల్లో రాఖీలు లభిస్తున్నాయి. ఓం, స్వస్తిక్, నెమళ్లు, శంకుచక్రాలు, పక్షులు, వృక్షాలు, రుద్రాక్ష ఇలా అనేక రకాలుగా ప్రకృతి రమణీయతను ప్రతిబింబించే ఆకృతుల్లో చిన్న, పెద్ద సైజుల్లో లభిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా, రైల్వేస్టేషన్, కుమార్గల్లీ, గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన రాఖీ దుకాణాలు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని స్వీట్ షాపులు సైతం వినియోగదారులతో కిక్కిరిసిపోయాయి.