స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
అంకోల్ గ్రామంలో నూతన జీపీ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభం
నస్రుల్లాబాద్, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని అంకోల్ గ్రామంలో రూ.21 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో గతంతో 8,670 గ్రామ పంచాయతీలు ఉండేవని, పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ వాటిని 12,751కి మార్చారని తెలిపారు. 2,800 తండాలను కూడా జీపీలుగా తీర్చిదిద్దారని అన్నారు.
దేశంలో పది ఉత్తమ పంచాయతీలకు గాను ఏడు పంచాయతీలు మన రాష్ట్రం నుంచి ఎన్నికయ్యాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.338 కోట్లను గ్రామ పంచాయతీలకు, రూ.130 కోట్లను మున్సిపాలిటీలకు విడుదల చేస్తున్నదని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని, బాన్సువాడ నియోజకవర్గానికి పదివేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయించానని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే తన ధ్యేయమని స్పీకర్ తెలిపారు.
11న రిజర్వాయర్, కాలువల నిర్మాణానికి భూమిపూజ
నియోజకవర్గంలో సాగునీటి సరఫరా కోసం సిద్ధాపూర్ రిజర్వాయర్, కాలువల కోసం రూ.122 కోట్లు, చందూర్, జాకోరా ఎత్తిపోతల కోసం రూ.106 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నెల 11వతేదీన మంత్రి కేటీఆర్ రిజర్వాయర్, కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం అంకోల్ తండాలోని జగదాంబ, సేవాలాల్ మహరాజ్ ఆలయ వార్షికోత్సవంలో స్పీకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన మహిళలతో సంప్రదాయ నృత్యం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ పాల్త్య విఠల్, జడ్పీటీసీ సభ్యురాలు జన్నూబాయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సాయిలు యాదవ్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, సర్పంచ్ సాయిలు, విండో చైర్మన్లు సుధీర్, గంగారాం, నాయకులు ప్రతాప్, కంది మల్లేశ్, మాణిక్ బాషా, సురేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.