నెలరోజులపాటు ప్రత్యేక తరగతులు
కొవిడ్ నిబంధనలు పాటించాలి
కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
నిజామాబాద్ సిటీ, ఆగస్టు 30 : పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లను, హాస్టళ్లను సందర్శించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లోని సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీచర్‌ను నియమించాలని ఆదేశించారు. శానిటైజర్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. 16 నెలల తరువాత పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని, విద్యార్థులకు బేసిక్స్ బోధించేందుకు ఒకనెలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు వారి పరిధిలోని ప్రతి రోజూ ఒక హాస్టల్‌ను విజిట్ చేసి పిల్లలతో కలిసి భోజనం చేయాలన్నారు. క్లస్టర్ ఆఫీసర్ రోజువారీ వివరాలు అందజేయాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు బుధవారం నుంచి శనివారం వరకు స్కూళ్లు, హాస్టళ్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశించారు.
హరితహారం లక్ష్యాన్ని పూర్తిచేసిన ఆయా శాఖల అధికారులు జియోట్యాగింగ్ చేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, ఆర్డీవో రవి తదితరులు పాల్గొన్నారు.