v
సీపీ నాగరాజుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
దళిత సంఘాల ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ నాల్గోటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నాయకుల ఫిర్యాదు
ఖలీల్‌వాడి/నిజామాబాద్ క్రైం, జనవరి 29 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో పసుపు బోర్డు విషయమై రైతులు ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడి చేస్తే.. సీపీ నాగరాజు పర్యవేక్షణ లోపంతోనే దాడి జరిగిదంటూ దళితుడైన సీపీని కించపరిచేలా వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్వింద్ వెంటనే సీపీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పులి జైపాల్, రాష్ట్ర నాయకుడు బాల్‌రాజు, జిల్లా ఇన్చార్జి పాశంకూమార్, సమత, గోర్కంటి లింగన్న, ఎడ్ల సంజీవ్, సుభాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ అర్వింద్‌పై నాల్గో టౌన్లో ఫిర్యాదు
దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్లో ఎంపీపై శనివారం ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల పరిధిలోని ఇస్సాపల్లిలో పసుపు బోర్డు విషయమై రైతులు ఎంపీ కాన్వాయ్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. దళితుడైన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు పర్యవేక్షణ లోపంతోనే తన పై దాడి జరిగిందంటూ ఎంపీ అర్వింద్ సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ మాల మహానాడు, మాల మహానాడు, దళిత సంఘాల నాయకులు ఖండించారు.
అలాగే నిజామాబాద్‌లోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో ఎంపీపై నమోదైన అట్రాసిటీ కేసుపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అల్ మాల స్టూడెంట్స్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ వినతి పత్రంలో పేర్కొన్నారు.