అన్ని తానై సేవలు చేస్తున్న భర్త పండరి
పెండ్లయిన 7 నెలలకే బ్రెయిన్ ట్యూమర్
దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని విన్నపం
కామారెడ్డి టౌన్, డిసెంబర్ 28 : కలిసి సంతోషంగా బతకాలనుకున్న జంటపై విధి పగబట్టింది. ఎన్నో ఆశలతో పెండ్లి చేసుకున్న వారిని బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కష్టాల కడలిలోకి నెట్టేసింది. పెండ్లయిన ఏడు నెలలకే మాయదారి రోగం కొత్తగా ప్రారంభించిన వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. భార్యకు బ్రెయిన్ ట్యూమర్ సోకడంతో భర్త దాతల సాయంతోపాటు తెలిసినవారి వద్ద అప్పులు చేసి రెండుసార్లు ఆపరేషన్ చేయించాడు. సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చుచేసినా ఫలితం లేకపోయింది. కాళ్లు,చేతులు చచ్చుబడి పోవడంతో అన్ని తానై భార్యకు సేవ చేస్తున్నాడు. ఇందుకు సం బంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన పండరితో స్వరూపకు ఐదేండ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. పెండ్లయిన ఏడు నెలలకే స్వరూపకు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సోకింది. రెండుసార్లు హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చేర్పించి, ఆపరేషన్‌కు రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా స్వరూప ఆరోగ్యం మెరుగుపడలేదు. నాలుగేండ్లుగా భర్త పండరి భార్యకు అన్నీతానై సేవలందిస్తున్నాడు. వడ్లం గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్లి రావడం ఇబ్బందిగా మారడడంతో ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలో ఉంటున్నారు. పండరి పెయింటింగ్ పనిచేస్తాడు. కుటుంబపోషణ కోసం భార్యను ఒంటరిగా ఇంట్లో ఉంచి కూలీ పనులకు సైతం వెళ్లేవాడు. గత ఏడాది నుంచి స్వరూపకు అప్పుడప్పుడూ ఫిట్స్ వస్తుండడంతో పండరి ఇంటి వద్దనే ఉంటున్నాడు. దాతల సహాయంతో ప్రస్తుతం కుటుంబపోషణ కొనసాగుతున్నది. మెడిసిన్‌కు ప్రతి నెలా సుమారు రూ. 5 వేలు ఖర్చవుతున్నదని, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందజేయాలని పండరి వేడుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ తన భార్యను కాపాడాలని కోరుతున్నాడు. ఆర్థిక సహాయం అందించే వారు కెనరా బ్యాంక్ అకౌంట్ నంబర్ 35272200080067, ఐఎఫ్ఎస్సీ కోడ్ 00013527లో లేదా 9390807971 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నాడు.