నూతన జోనల్ విధానం ప్రకారమే పోస్టింగ్‌లు
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియ
కొత్తగా జిల్లాలు మారిన వారికే వర్తించనున్న బదిలీలు
ఉమ్మడి జిల్లాలో 13,621 మంది జిల్లా కేడర్ ఉద్యోగులు
నిజామాబాద్‌కు 7,941 మంది, కామారెడ్డికి 5,680 మంది కేటాయింపు
నిజామాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం చేపట్టిన జిల్లా కేడర్ పోస్టుల విభజన ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. ఆయా జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 13,621 మంది జిల్లాస్థాయి కేడర్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు 7,941 మందిని, కామారెడ్డి జిల్లాకు 5,680 మందిని కేటాయించారు. ఇందులో నూతన జోనల్ విధానాన్ని అనుసరించి కామారెడ్డి జిల్లా నుంచి నిజామాబాద్‌కు 634 మందిని కేటాయించగా.. నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 1006 మంది వెళ్లనున్నారు. కేటాయింపులు పూర్తికావడంతో స్థానికత ఆధారంగా జిల్లాలు మారిన ఉద్యోగుల్లో సీనియారిటీ ప్రకారం ఆయా శాఖల అధిపతులు జాబితాలను శనివారం పూర్తిచేశారు. దీని ఆధారంగానే బదిలీలు, పోస్టింగ్‌లను పారదర్శకంగా నిర్వహించనున్నారు.
నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల విభజనలో తొలి ఘట్టం త్వరలోనే సంపూర్ణం కానున్నది. మొదట చేపట్టిన జిల్లా కేడర్ పోస్టుల విభజన ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆయా జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేడర్ పోస్టుల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో అందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేడర్ స్ట్రెంగ్త్ ప్రకారం 13,621 మంది ఉద్యోగులున్నారు. వీరిలో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు 7,941 మందిని, కామారెడ్డి జిల్లాకు 5,680 మందిని కేటాయించారు. వీరిలో జిల్లాలు మారిన ఉద్యోగులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా నూతనంగా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. స్థానికత ఆధారంగా జిల్లాలు మారిన ఉద్యోగుల్లో సీనియారిటీ ప్రకారం ఆయా శాఖల అధిపతులు జాబితాలను శనివారమే పూర్తి చేశారు. దీని ఆధారంగానే బదిలీలు, పోస్టింగ్‌లను అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నారు. జిల్లా కేడర్ పూర్తవ్వగానే జోనల్, మల్టీ జోనల్ పోస్టులపై ప్రభుత్వం దృష్టి సారించనున్నది.
వేగంగా పోస్టింగ్‌లు…
నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లా కేడర్ పోస్టు ల విభజన ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటున్నది. స్థానికత ఆధారంగా ఆయా జిల్లాల కేటాయింపు ప్రక్రియ మాదిరిగానే సామరస్యంగా ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వారం రోజుల వ్యవధిలో మొత్తం ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నది. బదిలీలకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగికి పోస్టింగ్ ఖరారు చేయనున్నారు. రెండు, మూడు రోజుల్లోనే జిల్లాలు మారిన ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.ఉమ్మడి జిల్లాలో 13,621 మంది ఉద్యోగులను జిల్లా స్థాయి కేడర్ స్ట్రెంగ్త్ ప్రకారం కేటాయింపులను ఇప్పటికే పూర్తి చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 7,941 మందిని, కామారెడ్డి జిల్లాకు 5,680 మందిని కేటాయించారు. ఇందులో నూతన జోనల్ విధానాన్ని అనుసరించి కామారెడ్డి జిల్లా నుంచి నిజామాబాద్‌కు 634 మందిని కేటాయించారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 1006 మంది వెళ్లనున్నారు. కేటాయింపులు పూర్తయిన ఉద్యోగుల్లో జిల్లాలు మారిన వారిని ఆధారంగా చేసుకుని ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సీనియారిటీ ఆధారంగా జాబితాను రూపొందించారు. శనివారమే తుది జాబితాను ఇరు జిల్లాల కలెక్టర్లకు సమర్పించారు.
ఉద్యోగుల నుంచి ఆప్షన్లు..
కేటాయింపు ప్రక్రియకు ముందుగా ఏర్పడ్డ ఖాళీలతో పాటు, తాజా ఉద్యోగుల కేటాయింపుతో ఏర్పడ ఖాళీలను కూడా బదిలీలు, పోస్టింగ్స్‌కు పరిగణలోకి తీసుకుంటారు. కేటాయింపుల్లో మారుమూల ప్రాంతాలు, ఆయా శాఖల అవసరాలను బట్టి కనీస సిబ్బంది ఉండేలా చూసుకుంటారు. తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి సమతుల్యతలను పాటిస్తారు. సీనియార్టీ, ఉద్యోగులిచ్చిన ఆప్షన్ ఆధారంగానే బదిలీలుంటాయి. టీజీవో, టీఎన్జీవో ఇతర ఉద్యోగ సంఘాల సభ్యుడిని ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తారు. జీవో 317లో సూచించిన ప్రత్యేక కేటగిరీలతో పాటు స్పౌజ్ కేసులు వారికి బదిలీలు, పోస్టింగ్‌లో ప్రాధాన్యం ఇస్తారు. ఆయా శాఖల్లో పరిపాలన అవసరాలను పరిగణనలోకి తీసుకుని, కేటగిరీల వారీగా తేల్చి పోస్టింగ్స్ ఇస్తారు. ఉదాహరణకు పాత నిజామాబాద్ జిల్లాలోని ఓ ఉద్యోగి కామారెడ్డి జిల్లాలో పని చేస్తూ తాజాగా కేటాయింపుల్లో తిరిగి అదే జిల్లాకు కేటాయించి ఉంటే సదరు ఉద్యోగి రిపోర్ట్ చేస్తే అదే పోస్టులో కొనసాగిస్తారు. ఆ ఉద్యోగిని తాజా పోస్టింగ్ కోసం పరిగణనలోకి తీసుకోరు. అదే పూర్వపు నిజామాబాద్ జిల్లా ఉద్యోగి కొత్త నిజామాబాద్ జిల్లాలో పని చేస్తూ తాజాగా కామారెడ్డి జిల్లాకు కేటాయించి ఉంటే సంబంధిత ఉద్యోగికి కౌన్సెలింగ్ నిర్వహించి కామారెడ్డి జిల్లాలోని ఖాళీలను బట్టి పోస్టింగ్ ఇస్తారు.
తదుపరి జోనల్, మల్టీ జోనల్ వర్గీకరణ
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పురుడు పోసుకున్న నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం పరిపాలన వ్యవస్థను స్థిరీకరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన మొదలవ్వగా జిల్లా కేడర్ పోస్టుల ప్రక్రియ పరిసమాప్తం కానున్నది. అనంతరం జోనల్, మల్టీ జోనల్ పోస్టుల వర్గీకరణను ఇదే ప్రక్రియ ఆధారంగా చేయనున్నారు. నూతన జోనల్ విధానం ప్రకారం బదిలీలు, పోస్టింగ్‌లకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్తగా జిల్లా మారిన ఉద్యోగులకు మాత్రమే బదిలీలు చేపట్టనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా బదిలీలు చేపట్టి పోస్టింగ్ ఇవ్వనున్నారు. బదిలీలకు స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితాను రూ పొందించారు.
ఆయా శాఖాధిపతులు సెలవు దినం అయినప్పటికీ శనివారమే కసరత్తు చేసి ఉద్యోగుల జాబితాను తీర్చిదిద్దారు. ఆ తర్వాత సీనియారిటీ జాబితాను ప్రదర్శించి, ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. బదిలీలు, కేటాయింపులు జిల్లా స్థాయిలో కలెక్టర్‌తో పాటు, సంబంధిత శాఖ జిల్లా హెచ్‌వోడీల కమిటీ చేపడుతుంది. వారంలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించారు. బదిలీలు, పోస్టింగ్‌ల తర్వాత ఉద్యోగులు మూడు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు ప్రభుత్వం విడిగా మార్గదర్శకాలు ఇవ్వనున్నది.