బోధన్ నుంచి ప్యాసింజర్ రైళ్ల రద్దు
రాకపోకలు నిలిపివేసి రెండు సంవత్సరాలు..
వినతిపత్రాలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోని కేంద్రం
బోధన్ వేదికగా ఆందోళనకు సిద్ధమవుతున్న యువత, పలు పార్టీలు
శక్కర్‌నగర్, ఆగస్టు 23:ప్యాసింజర్ రైలు కూతలు లేక బోధన్ రైల్వేస్టేషన్ మూగబోయింది. వివిధ కారణాల నెపంతో రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి సుమారు రెండేండ్లు దాటింది. అయినా కూడా రైళ్ల రాకపోకలు పునరుద్ధరించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల చరిత్ర ఉన్న బోధన్-నిజామాబాద్ రైల్వే మార్గానికి ప్యాసింజర్ రైళ్లు నిలిపివేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. రైళ్ల రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతూ సంబంధిత శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ ప్రాంత నాయకులు, ప్రజలు, యువకులు వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో పార్టీలకతీతంగా ఆందోళనలు చేపట్టేందుకు యువత కార్యాచరణ రూపొందిస్తున్నది. త్వరలోనే అన్ని పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పోరాటం ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
రెండు రైల్వేస్టేషన్ల మూసివేతకు ఉత్తర్వులు..
బోధన్ పరిధిలోని ఎడపల్లి, శక్కర్‌నగర్ రైల్వేస్టేషన్లలో రద్దీ, ఆదాయం లేదనే కారణంతో మూసివేతకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, బోధన్‌కు రైళ్లు సరిగ్గా నడపకపోతే ఆదాయం ఎలా వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. బోధన్‌కు వచ్చే గూడ్స్ రైళ్లతో ఏటా సుమారు రూ.35కోట్ల ఆదాయం వస్తుంది. ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన అధికారులు ఆదాయం లేదనే సాకుతో రైల్వేస్టేషన్ల మూసివేతకు చర్యలు చేపట్టడం శోచనీయమని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బోధన్- నిజామాబాద్ రైల్వేలైన్ కేవలం గూడ్స్ రైళ్ల రాకపోకలకు మాత్రమే పరిమితం అయ్యింది. రైల్వేస్టేషన్ల మూసివేత అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వేశాఖ ఆధ్వర్యంలో బోధన్‌లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ ను సైతం మూసివేశారు. ఇలా ఒక్కొక్కటిగా మూసివేస్తుండడంతో రైళ్లు వస్తాయా ? రావా? అనే అయోమయంలో ప్రజలు ఉన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా..
బోధన్- నిజామాబాద్ మధ్య రైళ్ల రాకపోకలను రద్దు చేయడంతో మధ్యలో ఉన్న పలు స్టేషన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు గా మారాయి. గ్రామ శివారులకు దూరంగా ఉండడం, పర్యవేక్షించేవారు లేకపోవడం, ఇటీవల స్టేషన్ల మూసివేత ఆదేశాలు రావడంతో పలువురు మద్యం సేవించేందుకు, పేకాట ఆడేందుకు స్థావరాలుగా మార్చుకున్నారు.
ఆందోళనలు చేస్తాం..
బోధన్ నుంచి ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే వరకు ఆందోళనలు చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో రైళ్ల పునరుద్ధరణ ప్రజలకు ఎంతో అవసరం. బోధన్‌లోని అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. మూసివేసిన స్టేషన్లను కూడా తిరిగి ప్రారంభించేలా ఉద్యమిస్తాం.
-ఎం. శివకుమార్, విద్యార్థి సంఘం నాయకుడు, బోధన్.