అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెద్దపీట
ధరణితో భూ సమస్యలకు పరిష్కారం
పంట కొనుగోళ్లతో అన్నదాతకు చేయూత
రైతుబంధు, రైతుబీమాతో ఆర్థిక స్వావలంబన
ఏటా పెరుగుతున్న పంటల సాగు విస్తీర్ణం
కామారెడ్డి, డిసెంబర్ 21: స్వయాన రైతుబిడ్డ అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడంతో రైతుల సమస్యలు తీరుస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటివరకు వ్యవసాయరంగానికి ప్రాధాన్యమిస్తున్నారు. వ్యవసాయంలో సీఎం కేసీఆర్ తీసుకొస్తున్న మార్పులతో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అన్నదాతలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. రైతన్న అప్పులపాలు కావొద్దని, విత్తనం వేయడం నుంచి మొదలుకొని పంట కొనుగోలు వరకు వెన్నంటే ఉంటున్నారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రైతులను ధనవంతులుగా తీర్చిదిద్దే బృహత్తర ప్రయత్నం చేస్తున్నారు. అప్పుల ఊబి నుంచి బయటికి వచ్చి అన్నదాత ఖాతాల్లో రూ.5లక్షల నుంచి 10లక్షల వరకు జమ కావాలనే ఆకాంక్షకు దగ్గరగా తీసుకువస్తున్నారు. ఇందుకోసం పంటలకు మద్దతు ధర లభించేలా కృషి చేస్తున్నారు. ఓ వైపు కేంద్రం పంట కొనుగోళ్లపై ఆంక్షలు పెడుతున్నా నేనున్నానంటూ భరోసానిస్తున్నారు.
పంట కొనుగోళ్లలోనూ..
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను దళారులకు అమ్మి మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు రంది లేకుండా చేస్తున్నది. కామారెడ్డి జిల్లాలో గత యాసంగిలో 4లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి లక్షా 10వేల మంది రైతులకు రూ.850కోట్లను చెల్లించింది. వానకాలంలో 1,62,918 ఎకరాల్లో వరి పండించాల్సి ఉండగా, 2,76,850 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం కన్నా 170శాతం పెరిగింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం 6లక్షల 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకోగా, 5లక్షల 20వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు అవుతుందని అంచనా వేస్తున్నారు. సింగిల్ విండో సొసైటీలు, ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. జిల్లాలోని 22మండలాల్లో 344కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 10, మార్కెట్ కమిటీలు 10, ఐకేపీ 22, పీఏసీఎస్ ద్వారా 308కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గ ప్రాంతాల్లో 175 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తికాగా ఇప్పటికే రూ.700కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
ధరణితో భూ సమస్యల పరిష్కారం..
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 28న ధరణి పోర్టల్‌ను ప్రారంభించగా, అన్ని జిల్లాల్లోని తహసీల్ కార్యాలయాల్లో నవంబర్ 2వ తేదీ నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల పరిధిలో 11,806 భూ సమస్యల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తహసీల్ కార్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్‌తోపాటు రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. ధరణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కామారెడ్డి కలెక్టరేట్లో 08468-220069 నంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో 31 లావాదేవీల మాడ్యుల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యుల్స్ ఉన్నాయి. జిల్లాలోని బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండలో మాత్రమే ఎస్ఆర్వోలు ఉండగా, ప్రస్తుతం 22 మండల కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నది.
పెరుగుతున్న సాగు విస్తీర్ణం..
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి నీటి సౌకర్యం కల్పించేందుకు పెద్దపీట వేయడంతో లక్షలాది ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. ఒక వైపు వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రాజెక్టులు మొదలుకొని చెరువులు, కుంటల్లో నీటి సామర్థ్యం పెరిగింది. దీంతో భూగర్భజలాలు ఉబికివస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో గతం కన్నా ప్రతి వానకాలం, యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది.
రైతుబీమాతో భరోసా..
దేశానికి వెన్నెముక అయిన రైతన్న కుటుంబాలు వీధిన పడకుండా ఉండేందుకు 2018లో సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రారంభించారు. రైతు మృతి చెందితే వారి కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.5లక్షలను సర్కారు అందజేస్తున్నది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 3,596 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రైతుబీమా అందింది. నాలుగేండ్లలో 3,596 మంది రైతు కుటుంబాలకు రూ.177కోట్ల75లక్షల బీమా మొత్తాన్ని అధికారులు అందజేశారు. 2018లో లక్షా 31వేల 759మంది రైతులకు బీమా వర్తింపజేయగా, వీరిలో 787 మృతిచెందారు. 787మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.39కోట్ల 35లక్షలు విడుదల చేశారు. 2019లో లక్షా 57వేల141 మంది రైతులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించగా, 872 మంది రైతులు మరణించారు. వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.43కోట్ల 60లక్షలను సర్కారు అందజేసింది. 2020-21లో లక్షా 68వేల 700 మందిని రైతుబీమాకు అర్హులుగా గుర్తించగా 1611 మంది వివిధ కారణాలతో మరణించారు. వీరిలో 1,584మంది కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున రూ.79కోట్ల20లక్షల పరిహారం అందజేశారు. 2021-22లో లక్షా 86వేల 417 మంది రైతుబీమాకు అర్హత సాధించారు. వీరిలో 326 మంది మరణించగా, 312 కుటుంబాలకు బీమా పరిహారం రూ.15 కోట్ల 60లక్షలు విడుదల చేశారు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న 18 నుంచి 58 ఏండ్లు ఉన్న ప్రతి రైతుకూ రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా వర్తింపజేస్తున్నది.