తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 19. సాహిత్య రంగంలో యువత కనిపించడం లేదనే వాదనకు తెలంగాణ సారస్వత పరిషత్తు నడుం బిగించి పాఠశాల స్థాయి నుంచే వందలాదిగా కవులు, రచయితలను తయారుచేసేందుకు పూనుకోవడం హర్షించదగిన విషయమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు మొదటి సారిగా రాష్ట్ర స్థాయి పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన కవిత, కథా, రచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం శుక్రవారం పరిషత్తు ప్రాంగణంలో ఉన్న దేవులపల్లి రామానుజారావు కళా ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. 78 ఏండ్ల సాహిత్య చరిత్ర కలిగిన సారస్వత పరిషత్తు వేదికపై విద్యార్థులు బహుమతులు అందుకోవడం అదృష్టంగా భావించాలన్నారు. పోటీల విజేతలకు రూ.5వేలు ప్రథమ బహుమతి, రూ.3వేలు ద్వితీయ బహుమతి, రూ.2వేలు తృతీయ బహుమతి, ప్రత్యేక బహుమతి కింద వెయ్యి రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సత్కరించారు. పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు, ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎ. సిల్మానాయక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కవితా రచనలో..
జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలకు చెందిన ఇ.రాందాస్‌నాయక్ ప్రథమ బహుమతి, వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి చెందిన రాసమల్ల అక్షయకు ద్వితీయ, దిల్సుఖ్నగర్ చెందిన వివేక్‌కృష్ణ తృతీయ బహుమతి అందుకున్నారు. ప్రత్యేక బహుమతుల విభాగంలో యం. గంగాదేవి(నిజామాబాద్ జిల్లా తడపాకల్)తో పాటు మరికొందరు అందుకున్నారు.
కథా రచనల విభాగంలో..
నారాయణపేట జిల్లా పులిమామిడికి చెందిన బి. స్వప్నకు ప్రథమ బహుమతి, నిజామాబాద్ జిల్లా ముబారక్‌నగర్‌కు చెందిన బి. శ్రీహితకు ద్వితీయ, నల్లగొండ జిల్లా వల్లాలకు చెందిన జోలం మాధురికి, మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కె.స్ఫూర్తికి తృతీయ బహుమతి లభించింది.
కె. తనూజ(నిజామాబాద్ జిల్లా ముబారక్‌నగర్), యం. గంగాదేవి(నిజామాబాద్ జిల్లా తడపాకల్)తో పాటు మరికొందరు ప్రత్యేక బహుమతులు అందుకున్నారు.