లింగంపేట, నవంబర్ 14: మండలంలోని వివిధ గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. లింగంపేట సహకార సంఘం పరిధిలోని భవానీపేట, పర్మళ్ల, కోమట్పల్లి, పోతాయిపల్లి, మెంగారం, బోనాల్, లింగంపల్లి, సురాయిపల్లి, అయ్యపల్లి, శెట్పల్లి, జల్దిపల్లి, రాంపూర్, ఐలాపూర్, ముంబాజీపేట తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ఆదివారం వరకు 1138 మంది రైతుల నుంచి 65,678 క్వింటాళ్ల ధాన్యాన్ని తూకం వేశామని సహకార సంఘం సీఈవో సందీప్ తెలిపారు. రైతులకు వరుస క్రమంలో నంబర్లు కేటాయించి, ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
అడవి లింగాలలో ధాన్యం కొనుగోళ్ల నిలిపివేత
ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 14 : మండలంలోని అడవి లింగాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ రెండు రోజులుగా నిలిచిపోయింది. లారీలో ధాన్యం నింపే క్రమంలో తాడు గుంజే డబ్బులను హమాలీలకు లారీ యజమానులు ఇవ్వాల్సి ఉంటుందని, వారు డబ్బులు ఇవ్వకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని ఎల్లారెడ్డి సొసైటీ డైరెక్టర్ పౌల్ తెలిపారు. ఇప్పటివరకు 20 లారీలు నింపిన హమాలీలకు లారీకి మూడు వందల రూపాయల చొప్పున తాను అందజేశానని తెలిపారు. రైతుల వద్ద డబ్బులు వసూలు చేయాలని లారీల యజమానులు పేర్కొంటున్నారని, రైతులు డబ్బులు ఇచ్చేందుకు సానుకూలంగా లేరని ఆయన తెలిపారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.
జోరుగా వరికోతలు
మాచారెడ్డి, నవంబర్ 14: మండలంలోని ఆయా గ్రామాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. మండలంలో ఇప్పటికే 70శాతం వరకు వరి కోతలు పూర్తయ్యాయని వ్యవసాయ విస్తరణ అధికారిణి లావణ్య తెలిపారు. రైతులు కల్లాల వద్ద ధాన్యం ఆరబెట్టినప్పుడు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షం పడితే ధాన్యం తడవకుండా ఉంటుందని తెలిపారు.