ఇతర పంటల సాగు వైపు వరి రైతుల చూపు
డిమాండ్ ఆధారంగా పంటలు వేయాలంటూ వ్యవసాయశాఖ అవగాహన సదస్సులు
యాసంగిలో నిజామాబాద్ జిల్లాలో పెరుగనున్న శనగ, సన్‌ఫ్లవర్ సాగు విస్తీర్ణం
బోధన్, అక్టోబర్ 6 : యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటలసాగు వైపు అన్నదాతలు అడుగులు వేస్తున్నారు. ధాన్యం సేకరణకు కేంద్రం ససేమిరా అంటున్న నేపథ్యంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ విస్తృతంగా అవగాహన కల్పించింది. దీంతో రైతుల ఆలోచనా ధోరణిలో మార్పు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రానున్న యాసంగి సీజన్‌కు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో శనగ, పొద్దుతిరుగుడు పంటలసాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశముంది.
‘మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండించాలి..’
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాల్లో అనేకసార్లు ప్రస్తావిస్తుంటారు. గత ఏడాది చెప్పినా.. రానున్న యాసంగి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని చెప్పినా అదే విషయాన్ని చెబుతుండడం వెనుక సీఎం కేసీఆర్‌కు ఉన్న దూరదృష్టి అర్థమవుతుంది. ధాన్యం సేకరణ లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల విధించిన ఆంక్షలు, అడ్డగోలు నిబంధనలతో.. ఇకముందు వరి పండిస్తే రైతులకు నష్టం వస్తుందన్న విషయాన్ని ముందుగానే గ్రహించడంతో.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయశాఖకు దిశానిర్దేశం చేశారు. ఇది సీఎం కేసీఆర్‌కు ఉన్న ముందుచూపునకు నిదర్శనం..
జిల్లాలోని రైతులు సహజంగానే చైతన్యవంతులు కావడంతో.. సీఎం ఆలోచనకు అనుగుణంగా వారిలో మార్పు కనిపిస్తోంది. సంప్రదాయంగా పదే పదే ఒకే పంటను వేయడం ద్వారా నేలకు జరుగుతున్న నష్టంతో పాటు.. రానున్న రోజుల్లో తమ పంటలకు మార్కెట్లో డిమాండ్ తగ్గుతుందన్న విషయాన్ని రైతులు గ్రహించేలా జిల్లాలో వ్యవసాయశాఖ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించింది. రైతు వేదికలే కేంద్రంగా రానున్న యాసంగిలో ఏయే పంటలు పండించాలో.. ఆ పంటలతో రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందో చెబు తూ వ్యవసాయ అధికారులు జిల్లాలోని అన్ని క్లస్టర్లలో అవగాహన సదస్సులు నిర్వహించారు. దీంతో రైతుల ఆలోచనా ధోరణిలో క్రమంగా మా ర్పు కనిపిస్తోంది.
ఆరుతడి పంటల వైపు..
జిల్లాలో రానున్న యాసంగి సీజన్ నుంచి ఆరుతడి పంటలను రైతులు సాగుచేసేలా వ్యవసాయశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి ఆరుతడి పంటల సాగు కోసం కార్యాచరణ రూపకల్పన కోసం కసరత్తు జరుగుతున్నది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు అనువైన నూనె గింజ లు, అపరాలు, ఇతర పంటలను ఎంపిక చేసింది.. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఏయే ఆరుతడి పంటలు పండిస్తే రైతులకు మేలు జరుగుతుందో వ్యవసాయశాఖ రైతులకు స్పష్టత ఇస్తోంది..
వాస్తవానికి, గత కొన్నేండ్లుగా జిల్లాలో వరి సాగు పెద్ద ఎత్తున జరుగుతున్నది.రాష్ట్ర ప్రభుత్వం కష్టనష్టాలకోర్చి ధాన్యం కొనుగోళ్లను చేయడం, ఇందుకు రైతులకు అందుబాటులో ఉండేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, సకాలంలో ధాన్యం బిల్లులను చెల్లిస్తుండడంతో రైతులు వరిసాగు చేస్తూ వచ్చారు. వరి ధాన్యం దిగుబడుల్లో గత రెండు, మూడు సంత్సరాలుగా జిల్లా పేరు రికార్డులకు ఎక్కింది. గత యా సంగిలో సైతం 3.86 లక్షల ఎకరాల్లో వరిని సాగుచేశారు. ఈ వానకాలం సీజన్లో కొంచెం అటుఇటుగా 3.41 లక్షల ఎకరాల్లో వరిని సాగుచేస్తున్నారు. జిల్లాలో అన్న పంటలు కలిపి 5,07,800 ఎకరాల్లో సాగుచేస్తుండగా, అందులో 75 శాతం వరి పంటే సాగవుతుండడం గమనార్హం. ఇప్పుడు ఈ వరిపంట విస్తీర్ణాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
పెరుగనున్న శనగ, పొద్దుతిరుగుడు పంటల సాగు
జిల్లాలో యాసంగి సీజన్లో వరికి ప్రత్యామ్నాయంగా శనగ, పొద్దుతిరుగుడు పంటల సాగు ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో సాగునీటి వసతి ఎక్కువగా ఉండడంతో వేరుశనగ పంట విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ యాసంగి సీజన్లో నూనె గింజలకు సం బంధించి వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు పంటలు సాగుచేయవచ్చని ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం సూచించింది. ఇక, అపరాల్లో శనగ సాగుకు జిల్లాలోని భూములు అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో గత కొన్నేండ్లుగా కూరగాయల సాగు తగ్గిపోతూ వచ్చింది. వాస్తవానికి, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు ఉన్నట్లయితే, కూరగాయల సాగు లాభాలను తెచ్చిపెడుతుందని ఉద్యానవనశాఖ అధికారులు అంటున్నారు. జిల్లాలోని నేలలు కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, పచ్చి మిరప, పుచ్చకాయ, ఆకుకూరలు, కూరగాయల పంటలకు అనుకూలంగా ఉన్నాయని, యాసంగిలో వీటిని సాగుచేయాలని జయశంకర్ విశ్వవిద్యాలయం అధికారులు సిఫార్సు చేశారు. బోధన్‌లోని కొన్ని గ్రామాల్లో చెరుకు పంట వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు.
పంటల మార్పిడితో పలు లాభాలు
వాస్తవానికి, ఏ వ్యవసాయ భూమిలోనైనా ఒకే రకమైన పంటను సంవత్సరాల తరబడి సాగుచేయ డం సరైనది కాదు. ఈ విషయమై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో ఏండ్లుగా చెబుతూ వస్తున్నారు. ‘పంటల మార్పిడి’ అన్నది వ్యవసాయంలో శాస్త్రీయమైన సాగు విధానంగా వ్యవసాయ పరిశోధనా సం స్థలు చెబుతున్నాయి. అయితే, రైతులు మాత్రం సంప్రదాయ పంటలకు అలవాటుపడడంతో భూసారం తగ్గిపోవడం, ఎరువుల వాడకం పెరగడం, తెగుళ్లు, చీడపీడలు ఎక్కువగా ఆశించడం జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలపై రైతులకు అవగాహన పెంచాలని నిర్ణయించింది. పంటల మార్పిడితో ఆరుతడి పంటలను సాగుచేయడంతో పంట సాగు ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరగడంతో ఎరువుల వాడకం తగ్గడంతో పాటు వాటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చు.
చీడపీడల ఉధృతి తగ్గుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, అన్ని రకాల పంటలు ఒక ప్రాం తంలో సాగవడంతో అవి ఆ ప్రాంతం ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా పోషక ఆహార భద్రత పెరుగుతుందని, ఫలితంగా కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం..
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. వరి పంటకు డిమాండ్ తగ్గితే.. భవిష్యత్తులో రైతులు నష్టపోరాదన్న ముందుచూపుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగానే అన్ని రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాం. యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు వేసేందుకు సిద్ధపడుతున్నారు. తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభం తీసుకువచ్చే ఆరుతడి పంటలను రైతులు సాగుచేయాల్సిన అవసరాన్ని రైతులు గుర్తించాలి.