సదాశివనగర్/ గాంధారి, అక్టోబర్ 1 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాలు బాగున్నాయని కేంద్ర బృందం సభ్యులు కితాబునిచ్చారు. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి, గాంధారి మండలకేంద్రంతో పాటు సీతాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను బృందం సభ్యులు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ముందుగా భూంపల్లి గ్రామశివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంలో మొక్కలను నాటి సంరక్షించడంపై సర్పంచ్ లలితాబాయి, అధికారులను అభినందించారు.
ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ చరణ్‌జిత్ సింగ్, సభ్యుడు ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చని పల్లెలు దర్శనమిస్తున్నాయన్నారు. అనంతరం సీతాయిపల్లి, గాంధారి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్‌తోపాటు పల్లె ప్రకృతివనం, కంపోస్టు షెడ్డు, ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను, గాంధారి మండల కేంద్రంలోని ముకర్రం చెరువును పరిశీలించారు. సీతాయిపల్లి గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులు పరిశీలించి స్థానిక అధికారుల నుంచి వివరాలను సేకరించారు. సీతాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన గొర్రెల షెడ్డును పరిశీలించి వివరాలను సేకరించారు. కేంద్ర బృందం సభ్యుల వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో సునంద, డీఎల్పీవో రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో సతీశ్, జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, ఏపీవో అన్నపూర్ణ, భూంపల్లి, గాంధారి, సీతాయిపల్లి సర్పంచులు లలితాబాయి, సంజీవులు, బీర్కూర్ రాజమణి, ఎంపీటీసీ సభ్యులు తదితరులు ఉన్నారు.