నిజామాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కామారెడ్డి ; కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్రం దృష్టంతా ఇక్కడే ఉంది.. దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి కామారెడ్డి బిడ్డలు రికార్డు సృష్టించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కొడితే ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాలె.. వారి డిపాజిట్లు గల్లంతు కావాలె. ఎంత మెజార్టీ ఇస్తే అంత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. శనివారం కామారెడ్డికి వచ్చిన ఆయన.. మంత్రి వేముల, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ పాటిల్‌తో కలిసి మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. కేసీఆర్ సంక్షేమ పాలన గురించి వివరిస్తూనే, కాంగ్రెస్, బీజేపీ తీరును ఎండగట్టారు. సినిమా డైలాగ్‌లతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తూనే, వారికి మార్గదర్శనం చేశారు. గడప గడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని సూచించారు.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన మరుక్షణమే ఆయన గెలుపుఖాయమైందని, ఇక్కడి బిడ్డలు బలపర్చిన విధానామే స్పష్టం చేసిందని, ఇప్పుడు తేలాల్సింది మెజారిటీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలో అత్యధిక మెజారిటీతో చరిత్ర పుటల్లో రాసే లా మీ నిర్ణయం ఉండాలని కామారెడ్డి ప్రజలను కోరారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌లతో కలిసి రూ.8కోట్లతో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో శ్రేణులంతా కలిసి మెలిసి పనిచేయాలని చెప్పారు. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా గెలిచి కేసీఆర్ సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని, అందుకు కామారెడ్డి వేదికగా నిలువబోతున్నదని చెప్పడంతో సభికుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బా ధ్యత కామారెడ్డి ప్రజలపై ఉన్నదన్నారు. కామారెడ్డి నియోజకవర్గం ఒక రోల్‌మోడల్‌గా నిలవడం ఖాయమని, ఆ బా ధ్యతను తానే తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు. 2004 లో కాంగ్రెస్ పార్టీతో జరిగిన పొత్తులో భాగంగా కామారెడ్డి ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి దక్కడం, ఆ ఎన్నికల్లో షబ్బీర్ తన గెలుపు కోసం కేసీఆర్‌ను బతిమిలాడుకున్న సంగతులను కేటీఆర్ విడమరిచి చెప్పారు.
అందరి దృష్టి కామారెడ్డి వైపే…
నెలన్నర రోజుల క్రితం బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఒకే నియోజకవర్గం గురించి చర్చ జరుగుతున్నదని కేటీఆర్ చెప్పారు. దేశం చూపు ఇప్పుడు కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి వైపే పడిందన్నారు. 2001లో పార్టీ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆనాటి నిజామాబాద్ జిల్లాలో మాత్రమే గులాబీ జెండా ఎగిరిందంటే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలే కారణమన్నారు. 10 జడ్పీటీసీలకు 8 రిజల్ట్స్ అనుకూలంగా వచ్చాయని గుర్తు చేశారు. మాచారెడ్డి మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ రెండు కూడా ఏకగ్రీవం కాగా 13 ఎంపీటీసీలు ఏకగ్రీవంతో మాచారెడ్డి సత్తా చాటిందని గుర్తుచేశారు. ఒకానొక సందర్భంలో పార్టీ నిధుల సేకరణకు కేసీఆర్ ఇక్కడికే వచ్చి పార్టీ అధ్యక్షుడిగా కూలీ పనులు చేశారని చెప్పారు. ఉద్యమం ఊపందుకున్న తర్వాత గంప గోవర్ధన్ ముందుకు వచ్చి 2011 ప్రాంతం లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కేసీఆర్‌తో కలిసి నడిచారని, 2012లో వచ్చిన ఉపఎన్నికల్లో మాచారెడ్డి, కామారెడ్డిలో తాను కూడా ఉడుతా భక్తిగా ప్రచారం చేశానని.. నాటి అనుభవాలను నెమరువేసుకున్నారు.
గంప గోవర్ధన్ గొప్ప మనసు
తన ప్రాంత ప్రజలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం గంప గోవర్ధన్ తన స్థానాన్ని వదులుకొని సీఎం కేసీఆర్‌ను పోటీ చేయాలని కోరడం గొప్ప విషయమని, ఆయన గొప్ప మనసుకు ఇదే నిదర్శమని కేటీఆర్ కితాబునిచ్చారు. కేసీఆర్ నీ నియోజకవర్గంలో పోటీ చేస్తే నీవేం చేస్తావని గంపన్నను అడిగితే కార్యకర్తగా పని చేస్తానంటూ చెప్పిన సమాధానం తనను ఎంతో కట్టి పడేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. గంప గోవర్ధన్ స్ఫూర్తితో కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో గంప గోవర్ధన్ మంచి పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. కామారెడ్డితో ఉన్న అనుబంధం ఈనాటిది కాదని, కేసీఆర్ తల్లిగారు, మా నాయనమ్మ సొంత ఊరు పోసానిపల్లి ప్రస్తుతం బీబీపేట మండలంలోనే ఉన్నట్లుగా చెప్పారు. అప్పర్ మానేరు కట్టిన సందర్భంలో భూములు మునిగిపోతే అక్కడ్నుంచి సిద్దిపేటలోని చింతమడకలో స్థిరపడ్డారన్నారు. సీఎంను కామారెడ్డి నియోజకవర్గానికి ఆహ్వానించినందుకు గంప గోవర్ధన్‌ను కేటీఆర్ అభినందించారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు సంచలనాలుగా ఉంటాయన్నారు. కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు ఉరుకుతున్నాయని, వారి గుండెలు జల్లుమంటున్నాయని అన్నారు. ముదిరాజ్‌లకు 2ఎకరాల స్థలం రూ.2కోట్లు ఇవ్వాలని అడుగగా అందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ముదిరాజ్‌లకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇస్తామన్నారు.
నేనే ఫాలో అప్ చేస్తా… రోజూ ఫోన్ చేస్తా…
266 పోలింగ్ బూత్‌లలో 2లక్షల48వేల మంది ఓటర్లున్నారని ప్రతి బూత్‌కు బాధ్యుడిగా ఒక సీనియర్ నాయకుడిని నియమించాలని సూచించారు. ప్రతి రోజూ ఈ బూత్‌ల వారీగా పనితీరును తానే పరిశీలిస్తానని చెప్పారు. ఈ బాధ్యతలను గంప గోవర్ధన్‌కు అప్పగించారు. మండల, జిల్లా స్థాయి లీడర్లు తమ పరిధి దాటి తిరగడం కన్నా తమ పరిధిలోని బూత్‌లలో పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని హితవు పలికారు. అలా పనిచేయడం ద్వారానే గుర్తింపు వస్తుందన్నారు. పెద్ద, చిన్న చూడకుండా ఒక్కో బూత్‌లో లెక్కబెట్టి కొడితే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుపు లాంఛనం కావాలని కేటీఆర్ చెప్పారు. “నేనే ఫాలో అప్ చేస్తా. రోజూ ఫోన్ చేస్తా. కొడితే ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా కొట్టాలి. ఎప్పుడొచ్చామన్నది కాదు. బుల్లెట్ దిగిందా..”అన్నట్లుగా మెజారిటీ రికార్డు కొట్టాలం టూ చెప్పడంతో సభికులంతా చప్పట్లతో కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. అధినాయకుడే వస్తుంటే మనమంతా కలిసి పనిచేయాలని, అందరం కలిసి పనిచేస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ రాదన్నారు. పాలి పగలు, పాత పగలు పక్కన పెట్టి ముందుకు పోవాలన్నారు. ప్రతి గ్రామం లో సోషల్ మీడియా కో ఆర్డినేటర్లను నియమించి సీఎం సందేశాలను వివరించాలన్నారు. గంప గోవర్ధన్ ఇక్కడి ఎమ్మెల్యేగా కామారెడ్డిని అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు.
మెడికల్ కాలేజీ తెచ్చుకున్నారని, ఇప్పుడు ఇంజినీరింగ్ కళాశాలకు సూటి పెట్టిండు గంపన్న అంటూ చమత్కరించారు. గంప గోవర్ధన్ ఇచ్చిన వినతిని చదివి వినిపించారు. సీఎం తలచుకుంటే అన్నీ సాధ్యమైతాయన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 146 ఎకరాలకు కంపౌండ్ వాల్, మినీ ట్యాంక్‌బండ్ పూర్తి, పబ్లిక్ గార్డెన్ అభివృద్ధి, డెయిరీ కళాశాలలో కృషి విజ్ఞాన్ కేంద్రం ఏర్పాటు, జిల్లాలో చారిత్రక కట్టాడాల అభివృద్ధి, రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్ వసతులు, క్రీడా ప్రాంగణాలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పుణ్య క్షేత్రాలను అభివృద్ధి చేయాలని గంప గోవర్ధన్ కోరారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాకమునుపు కష్టమొస్తే 60 కిలోమీటర్లు వెళ్లేవారని, కానీ కేసీఆర్, గంప గోవర్ధన్ కృషితో మీ చెంతకే కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ వచ్చిందంటూ చెప్పారు. సర్కారీ వైద్య కళాశాల వచ్చిందని, మన పిల్లలకు ఇక్కడే వైద్య విద్య అందుతున్నదన్నారు. 350 పడకల దవాఖాన, 100 మందికి పైచిలుకు వైద్యులతో త్వరలో అన్ని రకాల వైద్యం కోసం హైదరాబాద్‌కు పోవాల్సిన అవసరం ఉండదని, కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయన్నారు. బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, నిట్టు వేణుగోపాల్, వకీల్ రామారావు, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిర్మల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ గెలుపుతో మరింత అభివృద్ధి
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ప్రతి పల్లె, తండా, మండల కేంద్రా ల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమ లు చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ను అడిగిన వెంట నే మెడికల్ కాలేజీ మంజూరు చేయడం గొప్ప విజయంగా పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో డబుల్ లైన్ నుంచి ఆరు లైన్ల వరకు రోడ్డును మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. సెంట్రల్ లైటింగ్, కళాభారతి, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఇలా అభివృద్ధి పనులతో పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దామని తెలిపారు. కామారెడ్డి ఉద్యమాల గడ్డ అని, సీఎం కేసీఆర్‌ను ఇక్కడి నుంచే పోటీ చేయాలని తాను కోరానని, సీఎం కేసీఆర్ గెలుపుతో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకొని, రాష్ట్రంలోనే మేటి నియోజకవర్గంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కేసీఆర్‌ను కామారెడ్డి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలోని 33 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని, వివిధ కుల సంఘాలు, తండాలు సైతం కేసీఆర్‌కు మద్దతు తెలుపుతూ తీర్మానం చేసినట్లు చెప్పారు. ఐకమత్యంతో పనిచేసి సీఎం కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఏకగ్రీవాల కాపీలను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
కేసీఆర్‌కు స్వాగతం…
స్వరాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించి ప్రతిఫలం అందేవరకూ పోరాడి, నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు కామారెడ్డి తరఫున స్వాగతం పలుకుతున్నామని ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిర్మల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఏది తలిస్తే ఆ కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించిన గడ్డ కామారెడ్డి అని, ఉద్యమ స్ఫూర్తిని చూసి ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అలాంటి కేసీఆర్‌ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.
చరిత్ర తిరగరాసేలా భారీ మెజారిటీతో గెలిపించాలి..
చరిత్ర తిరగరాసేలా సీఎం కేసీఆర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి బీఆర్ఎస్ నాయకుల కోరిక మేరకు, ముఖ్యంగా విప్ గంపగోవర్ధన్ కోరిక మేరకు కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి అడ్డాగా కామారెడ్డి ఉన్నదని అన్నారు. కామారెడ్డి దశాదిశ మారబోతున్నదని తెలిపారు. రూ.195కోట్లతో మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతులు చేయించి కామారెడ్డి పట్టణానికి నీటిని అందించారని అన్నారు. కామారెడ్డి ప్రజలు ఎంతో అదృష్టవంతులని, సీఎం కేసీఆర్‌ను ఎంత మెజారిటీతో గెలిపిస్తే అంత అదృష్టం అన్నారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి లక్ష మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కౌన్సిలర్
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంపల్లి 2వ వార్డు కౌన్సిలర్ సుతారి రవి బీజేపీని వీడి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కామారెడ్డి నియోజకవర్గ పర్యటన విజయవంతమైంది. మూడున్నర గంటల పాటు కామారెడ్డి పట్టణంలో పర్యటించిన ఆయన.. బహిరంగ సభ ద్వారా శ్రేణుల్లో జోష్ నింపారు. తనదైన శైలిలో సుదీర్ఘ ప్రసంగంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఏ విధంగా సమాయత్తం కావాలన్న దానిపై సలహాలు సూచనలు అందించారు.