నిజామాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నామినేటెడ్ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. మొన్నటివరకు రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్ల పదవులను ఆశించి భంగపడిన వారందరూ.. ఇప్పుడు నుడా (నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పదవుల కోసం పాకులాడుతున్నారు. పార్టీలో పాత తరం నేతలు, కొత్తగా వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో విభేదాలు బహిర్గమవుతున్నాయి. ప్రభుత్వం నుడా చైర్మన్‌ను నియమించి నెలలు గడుస్తున్నా..ఇప్పటివరకు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు. నుడా డైరెక్టర్ పదవుల కోసం చాలా మంది ఆశావహులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు.
జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు మంత్రులు, ఇతర ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నుడాలో 13 మంది డైరెక్టర్ల నియామకానికి అవకాశం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం నుడా పరిధిని జిల్లా అంతటికీ విస్తరించడంతో డైరెక్టర్ల పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఏర్పడింది. దీంతో ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది. డైరెక్టర్ల కోసం పట్టుబడుతున్న వారిని సముదాయించే క్రమంలో కాంగ్రెస్‌లో పదవులు లొల్లి కొత్తగా తలనొప్పులను తెచ్చి పెడుతున్నది.
కీలక నేతల నిలదీత
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత చూపుతున్నవారు నామినేటెడ్ పోస్టులపై కన్నేశారు. కానీ వీరికి నేతల సహకారం దక్కకపోవడంతో రగిలి పోతున్నారు. ఇటీవల పార్టీ అంతర్గత సమావేశంలోనూ ఓ కీలక నాయకుడిని కొంతమంది జిల్లాకు చెందిన నేతలు నిలదీసినట్లు ప్రచారం జరుగుతున్నది. ‘మీరే పదవులు అనుభవిస్తారా…? మాకు పదవులు వద్దా…? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో నేతల మధ్య దూరం మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌కు నుడా డైరెక్టర్ల భర్తీపై పలువురు విన్నపాలు అందించినట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలతోనే తన వద్దకు రావాలని ఆయన సూచించడంతో కింది స్థాయి నాయకత్వం కినుక వహించినట్లు తెలిసింది.
భర్తీ ప్రక్రియకు ఎమ్మెల్యేల అడ్డుకట్ట!
నుడా డైరెక్టర్ల నియామకం ఎప్పుడో జరగాల్సి ఉండగా జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలే అడ్డుకుంటున్నట్లుగా తెలిసింది. తమ చెప్పు చేతల్లో ఉంటున్న వారికి పదవులు కట్టబెడితే, తర్వాత తమ మాట వినడం కష్టమేనన్న ఉద్దేశంతో భర్తీ ప్రక్రియను ముందుకు వెళ్లనీయడంలేదని సమాచారం. ఎమ్మెల్యే చొరవ తీసుకుంటే పదవుల భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉన్నా, పట్టించుకోకపోవడంపై పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులు మండిపడుతున్నారు.నుడాకు వెంచర్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై దృష్టిసారించాలి. ఏవైనా అక్రమాలు చోటుచేసుకుంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని వెంచర్ల ఏర్పాటులో సొంతపార్టీ నేతలే క్రియాశీలకంగా మారితే, తమకు ఇబ్బందులు తప్పవనే సాకుతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన నాయకులు వారిని తొక్కి పెడుతున్నట్లు ప్రచా రం జరుగుతుననది.
ఉనికి లేని కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
నుడా తరహాలోనే కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కుడా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో కూడా విస్తరించగా, ఇప్పటివరకూ పాలకవర్గం పత్తాలేకుండా పోయింది. ఉత్తర్వులు జారీ చేసినా సిబ్బంది నియామకం, పాలకవర్గం ఏర్పాటు ప్రతిపాదనలు ఇంకా రూపొందించలేదు. కామారెడ్డిలోనూ అధికార పార్టీలో ‘కుడా’ ఏర్పాటు రాజకీయం అగ్గి రాజేస్తున్నది. కామారెడ్డి మినహా మిగిలిన మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండడంతో డైరెక్టర్ల నియామకంలో ఎవరి పేర్లు ప్రతిపాదనకు వస్తాయో? అనే చర్చ జోరుగా సాగుతున్నది. రాజధాని హైదరాబాద్‌కు కామారెడ్డి పట్టణం వంద కిలో మీటర్ల దూరంలోనే ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘కుడా’ ప్రభావంతంగా మారే అవకాశాలు ఉండడంతో చాలా మంది నేతలు పదవులపైనే ఫోకస్ పెట్టారు. ఇందులో చోటు కల్పించడం కాంగ్రెస్ నేతలకు కత్తిమీది సాములా మారడంతో ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా పరిస్థితి మారింది.
కాగితాలకే పరిమితమైన పరిధి పెంపు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నుడా పరిధిలోకి 13 మండలాలు, 83 గ్రామాలను తీసుకువచ్చింది. డైరెక్టర్లుగా 13 మందికి అవకాశం కల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం నుడా పరిధిని జిల్లాలోని అన్ని మండలాలకు దాదాపుగా విస్తరించింది. జిల్లాలోని 33 మండలాల పరిధిలోని 383 గ్రామాలను నుడా పరిధిలోకి చేర్చింది. ఈ గ్రామాల పరిధిలో అభివృద్ధి పనులతో పాటు నిర్మాణాలు, మౌలిక వసతులను కల్పించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలను చేపట్టనున్నారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం నుడా పరిధిని పెంచిందని, కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ, పరిధి పెంపు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేసేందుకు ‘నుడా’ పరోక్షంగా అధికార కేంద్రంగా మారబోతుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. నుడా పరిధిని పెంచినా పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. నుడా చైర్మన్‌గా కేశ వేణును నియమించింది. 33 మండలాల్లోని గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చింది. దీంతో డైరెక్టర్ల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడడంతో కీలక నేతల అధికార దర్పం ఎక్కడ చేజారుతుందో అనే భయాందోళన వారిని వెంటాడుతున్నది.