నేటి రోజుల్లో మొబైల్ మన జీవితంలో ఓ భాగంగా మారింది. మనిషి నిద్రపోయినప్పుడు తప్ప మిగతా సమయాల్లో వెంటే పెట్టుకొని ఉంటున్నాడు. ఆర్థిక కార్యకలాపాలతోపాటు వ్యక్తిగత సమాచారమూ అందులోనే నిక్షిప్తమై ఉండడంతో కీలకంగా మారింది. ఇంతకీలక సమాచారం ఉన్న అలాంటి ఫోన్ ఒకవేళ పోగొట్టుకుంటే లేదా చోరీకి గురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ఇలా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను వెతికి జాడ కనిపెట్టడంలో కామారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 3,393 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.
కామారెడ్డి, ఆగస్టు 9: పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ఫోన్ల జాడ కనిపెట్టి, రికవరీ చేయడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని కమిషనరేట్లను మినహాయిస్తే కామారెడ్డి ముందువరుసలో ఉన్నది. జిల్లాలో సెల్‌ఫోన్ రికవరీలో బాన్సువాడ పోలీసు స్టేషన్ మొదటిస్థానంలో ఉండడం గమనార్హం.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3,393 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వెంటనే పోలీసుస్టేషన్లో ఫిర్యా దు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సెల్‌ఫోన్ ఎక్కడున్నా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కనిపెట్టి బాధితులకు అందజేస్తున్నారు.పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేయడానికి సీఈఐఆర్ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతున్నది.
సీఈఐఆర్ ద్వారా రికవరీ..
పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ఫోన్లను రికవరీ చేయడానికి సీఈఐఆర్ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతున్నది. మొబైల్ ఫోన్లను గుర్తించడంలో ఈ పోర్టల్ గతంలో కన్నా సులభతరమే కాకుండా అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నది. సీఈఐఆర్ ద్వారా వ్యక్తిగత సమాచార భద్రత కూడా కల్పిస్తుంది. వివరాలు నమోదు చేసి లాక్ చేయవచ్చు. ఫోన్ లభ్యమైన తర్వాత అన్‌లాక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉన్నది. గతేడాది ఏప్రిల్ మాసంలో సీఈఐఆర్ పోర్టల్‌ను వినియోగంలోకి తీసుకురాగా.. ఇప్పటివరకు 3,393 మొబైల్ ఫోన్ల జాడకనిపెట్టి, రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.
మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి వెంటనే కొత్త సిమ్ కార్డు తీసుకోవచ్చు. ఐఎంఈఐ నంబర్‌తో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయవచ్చు. మొబైల్ ఫోన్ దొరికిన వ్యక్తి మొబైల్లో సిమ్ కార్డు వేయడానికి ప్రయత్నిస్తే, సిమ్ కార్డు వివరాలు మనకు సీఈఐఆర్ ట్రాన్స్బిల్టి రిపోర్ట్‌లో కనిపిస్తాయి. ఫోన్ పోయిన వెంటనే www. ceir. gov. in లో రిజిస్టర్ చేసుకోవాలి. తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ వివరాలు సీఈఐఆర్ వెబ్సైట్లో బ్లాక్ చేయడంతో సులభంగా దొరికే అవకాశం ఉన్నది.
మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదుచేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా సెల్‌ఫోన్ రికవరీలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం సుమారు 3,393 సెల్ఫోన్లు రికవరీ చేశాం. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే రసీదు ఇస్తారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ నంబర్లను బ్లాక్ చేయవచ్చు.