కామారెడ్డి, డిసెంబర్ 26 : భిక్కనూర్ ఎస్సై సాయికుమార్‌తోపాటు బీబీ పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రుతి (33), మరో యువకుడు నిఖిల్ మృతి కేసులో విచారణ కొనసాగుతున్నదని కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ తెలిపారు. ఈ ముగ్గురు బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడగా.. వీరి ఫోన్ల సిగ్నల్స్ ఆధారంగా అడ్లూర్ పెద్ద చెరువు వద్ద ఉన్నట్లు తెలుసుకొని ఎస్పీ సింధూశర్మ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎస్సై సాయికుమార్ సొంతకారు ఉండడంతో అనుమానం వచ్చి చెరువులో గాలించగా బీబీపేట్ పీఎస్ కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట్‌కు చెందిన ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత లభించా యి. అనంతరం ఎస్సై సాయికుమార్ మృత దేహం కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో లభించింది. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. సాయికుమార్, శ్రుతి, నిఖిల్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అడ్లూర్ పెద్ద చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సాయికుమార్ జేబులో సెల్‌ఫోన్‌తోపాటు అతడికి చెందిన కారు, చెప్పులు, ఆపరేటర్ నిఖిల్ చెప్పులు సైతం అదేప్రాంతంలో లభ్యమైనట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జనరల్ దవాఖానకు తరలించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికతోపాటు పూర్తి విచారణ అనంతరం ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తామని చెప్పారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరామర్శించారు. ప్రభుత్వంతో మాట్లాడి ఎస్సై భార్యతో పాటు శ్రుతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. పోలీసుల విచారణ అనంతరం నిఖిల్ కుటుంబానికి న్యాయం చేస్తామని వెల్లడించారు. దవాఖాన వద్ద పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు.
బుధవారం మధ్యాహ్నం తర్వాత అదృశ్యమైన సాయికుమార్, శ్రుతి, నిఖిల్ ఒక్కచోటికి చేరారు. భిక్కనూరు, బీబీపేటలో ఉండే ముగ్గురూ తమ పరిధిలో కాకుండా సదాశివనగర్ మండలంలోని పెద్ద చెరువు వద్ద భేటీ అయ్యారు. ఎస్సై సొంత కారులోనే ముగ్గురు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, ముందుగా ఈ ముగ్గురు ఎక్కడ కలిశారు? ఎందుకోసం పెద్ద చెరువు వద్దకు వచ్చారన్నది అంతుచిక్కడం లేదు. మృతురాలు శ్రుతి ద్విచక్రవాహనం ప్రస్తుతం భిక్కనూర్ ఠాణాలో ఉండడం గమనార్హం. మరోవైపు, ముగ్గురి మృతి వెనుక ఉన్న కారణాలు ఏమిటనేది సస్పెన్స్‌గా మారింది. ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఒకరు ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకితే కాపాడే క్రమంలో మిగతా ఇద్దరు చనిపోయారా? అన్న సందేహాలు నెలకొన్నాయి. లేదా పెండ్లి విషయంలో తలెత్తిన అభిప్రాయ భేదాలతో ఇద్దరిని చంపి మరొకరు ఆత్మహత్య చేసుకున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మృతదేహాలపై రక్తపు మరకలు, గాయాలు ఉండడం ఈ సందేహాలకు బలం చేకూర్చుతున్నది. ప్రస్తుతం జరుగుతున్న అనేక ప్రచారాలకు పోస్టుమార్టం రిపోర్టుతోనే తెరపడనున్నది. మరోవైపు, చెరువు వద్ద లభ్యమైన మృతుల ఫోన్లను పరిశీలిస్తే మరణాలకు సంబంధించిన కీలకమైన సమాచారం లభ్యమయ్యే
అవకాశమున్నది.