బిచ్కుంద,మార్చి 18 : బిచ్కుంద మండలం ఖత్గామ్ మంజీర ఒడ్డున ఈ నెల15వ తేదీన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన అబ్దుల్ అహ్మద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు ను విచారించిన పోలీసులు తనయుడే హత్య చే యించినట్లు నిర్ధారించారు. బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అబ్దుల్ అహ్మ ద్ తాగుడికి బానిస కావడంతో విసుగు చెందిన ఆయన కుమారుడు మహ్మద్ తలాబ్ ఫయాజ్ హత్య చేసేందుకు పథకం రచించాడు. వారి వద్ద పని చేసే డ్రైవర్ శశికాంత్తోనే హత్య చేయించాడు. ఇసుక నింపుకోవడానికి ఈ నెల 14వ తేదీన అబ్దుల్ అహ్మద్, డ్రైవర్ శశికాంత్ వెళ్లారు. ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నారు. అర్ధరాత్రి శశికాంత్ ఇనుప రాడ్‌తో అబ్దుల్ అహ్మద్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం లారీని అహ్మద్ కాలుపై తిప్పి దూరంగా తీసుకెళ్లి నిలిపాడు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని డ్రైవర్ ఫోన్‌కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ చేపట్టగా కుమారుడే తమ వద్ద పని చేసే డ్రైవర్‌తో హత్య చేయించినట్లు నిర్ధారణ అయ్యిందని, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.