శక్కర్‌నగర్, అక్టోబర్ 11:ఉమ్మడి రాష్ట్రంలో అంతరించి, పట్టింపు లేకుండా ఉన్న కులవృత్తులు స్వరాష్ట్ర సాధన అనంతరం ఊపిరిపోసుకున్నాయి. కులవృత్తుల వారు దర్జాగా బతుకుతున్నారు. పనిలో చేయూతనివ్వడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గౌడ కులస్తులకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో కేసీఆర్‌ను గౌడ ‘జనబంధువు’గా అభివర్ణిస్తున్నారు. గీత కార్మికులుగా జీవితాలను గడిపే తాము గత ప్రభుత్వాల హయాంలో నిరాదరణకు గురయ్యామని, ఓ వైపు జీవనాధారం కల్లు గీసే వృత్తితోపాటు ఏడాదికోసారి లైసెన్సుల రెన్యువల్ పేరుతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లైసెన్స్ రెన్యువల్, రెంటల్ కట్టేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం కేసీఆర్ ముందుగా రెంటల్ విధానాన్ని రద్దు చేశారు. అనంతరం లైసెన్స్ రెన్యువల్‌ను ఐదేండ్లకోసారిగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మరోమారు లైసెన్స్ రెన్యువల్ విధానాన్ని పదేండ్లకోసారి చేపట్టాలని చర్యలు తీసుకున్నారు. దీంతో అటు గీత కార్మికులకు ఇటు గౌడ కులస్తులకు ఎంతో ఊరట లభించింది. పలు రకాల సంక్షేమ పథకాలు చేపట్టి సీఎం కేసీఆర్ గౌడ ‘జన బంధువు’గా ముద్ర వేసుకున్నారని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
గౌడ కులస్తులకు అండగా సర్కారు..
గౌడ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అండగా నిలుస్తున్నాయి. గతంతో పోలిస్తే చాలా ఇబ్బందులు దూరమయ్యాయి. కార్యాలయాలకు వెళ్లే పనితప్పింది. రెంటల్ రద్దు చేయడం, లైసెన్స్ రెన్యువల్ సమయాన్ని రెట్టింపు చేయడం, వైన్ షాపుల టెండర్లలో రిజర్వేషన్లు కల్పిస్తూ గౌడ కులస్తులకు సైతం ప్రాధాన్యం కల్పించడం హర్షణీయం. గౌడ కులస్తుల ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం. ప్రమాద బీమాను రూ. 2లక్షలను పెంచడం హర్షించదగ్గ విషయం.
– పరకాల సురేందర్ గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, ఆచన్‌పల్లి.
తిప్పలు తప్పాయి..
గతంతో పోలిస్తే చాలా తిప్పలు తప్పాయి. ఎన్ని పనులున్నా ఏడాదికోమారు ఎక్సైజ్ కార్యాలయానికి లైసెన్స్ రెన్యువల్ కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ సమయంలో అధికారులు అందుబాటులో ఉంటే సరి, లేకపోతే మరోమారు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి బాధలు లేకుండా పోయాయి. గీత కార్మికులకు కూడా ఆసరా పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరం. గీత కార్మికులకు తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయి.
– రావుట్ల ఎల్లాగౌడ్, ఎడపల్లి.
గీత కార్మికులకు బాసటగా సీఎం కేసీఆర్..
గీత కార్మికులకు సీఎం కేసీఆర్ బాసటగా నిలుస్తున్నారు. ప్రతి వర్గం, కులాలను ఆదరిస్తున్నారు. గౌడ కులస్తులను ప్రత్యేకంగా గుర్తించడం సంతోషకరం. వృత్తిపరంగా అందిస్తున్న సహకారం ఎనలేనిది. గీత కార్మికుల సమస్యలు గుర్తించి బాసటగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– ఎల్. రవికిరణ్ గౌడ్, ఆచన్‌పల్లి.