కామారెడ్డి, ఫిబ్రవరి 13 : కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు విధించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర శుక్రవారం తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్‌కు చెందిన మెడిద ప్రశాంత్ తన స్నేహితుడు పూణ ప్రసాద్ పేరుపై ఉన్న ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి, తర్వాత లోన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. లోన్ విషయమై ప్రసాద్..ప్రశాంత్‌ను నిలదీశాడు. దీంతో ప్రసాద్‌తోపాటు అతడి కుటుంబీకులందరినీ హత్యచేయాలని ప్రశాంత్ కుట్రపన్నాడు.
తన తమ్ముడు మెడిద తేజ కిరణ్, గుగులోత్ విష్ణు, బారోత్ వంశీకృష్ణతో కలిసి 2023 నవంబర్ 29న ప్రసాద్‌ను మాక్లూర్ శివారులోని అడవిలోకి తీసుకెళ్లి హత్య చేసి అక్కడే పాతిపెట్టా రు. అదే నెల 30న ప్రసాద్ భార్య రమణి అలియాస్ సాన్వికను కారులో మెడకు తాడు బిగించి హత్య చేసి, శవాన్ని బాసర బ్రిడ్జి నుంచి నీటిలో పడేశారు. తర్వాత ప్రసాద్ చిన్న చెల్లెలు శ్రావణిని మా చారెడ్డి వద్ద కారులో తీసుకెళ్లి చేగుంట శివారులో మెడకు తాడు బిగించి హత్య చేసి దహనం చేశారు. డిసెంబర్ 5న ప్రసాద్ కవల పిల్లలు చైత్రికా, చేత్రికను కారులో తీసుకెళ్లి తాడు తో ఉరివేసి శవాలను బాసర బ్రిడ్జి నుంచి పడేశారు.
13న ప్రసాద్ పెద్ద చెల్లెలు స్వప్నను హత్య చేసి,సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో శవంపై పెట్రోల్ పోసి దహనం చేశారు. కేసు నమోదు చేసుకొని, దర్యా ప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీతోపాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. అనుమానితుడిగా భావించిన మెడిద ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ప్రసాద్‌కు చెందిన ఆస్తిని పూర్తిగా కాజేయాలనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలినట్లు ఎస్పీ తెలిపారు.
ఆరుగురిని హత్య చేసిన ఈ కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ సాక్ష్యాధారాలను పరిశీలించి నేరం రుజువు కావడంతో మెడిద ప్రశాంత్‌కు ఉరి శిక్ష, రూ. 8 వేల జరిమా నా, మరో ఇద్దరు గుగులోత్ విష్ణు, మెడిద ఒడ్డెమ్మకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ. 8 వేల చొప్పున జరిమానా విధించారని పేర్కొన్నారు. మరో ఇద్దరు నేరం జరిగిన సమయానికి మైనర్లు కావడంతో వారిపై జువైనల్ కోర్టులో విచారణ కొనసాగుతుందని తెలిపారు.