అధికార వికేంద్రీకరణతో పాలన ప్రజలకు చేరువైంది. పల్లె పల్లెకూ ప్రభుత్వ పథకం చేరుతున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లాలను పునర్విభజన చేయడంతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. సరిగ్గా ఏడేండ్ల క్రితం.. 2016, అక్టోబర్ 11న పురుడు పోసుకున్న కామారెడ్డి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. కొత్త జిల్లా అయినప్పటికీ ఏడేండ్లలో ఎనలేని ప్రగతి సాధించింది. చిన్న జిల్లా కావడంతో ప్రజలకు దూరభారం తగ్గిపోయింది. అధికారుల పర్యవేక్షణ సైతం సులభతరం కావడంతో పనుల్లో పారదర్శకత పెరిగింది. రాజధాని హైదరాబాద్‌కు 100కిలో మీటర్ల దూరంలోనే ఉన్న కామారెడ్డి.. గతంలో తీవ్ర అన్యాయానికి గురి కాగా, ప్రస్తుతం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది.
నిజామాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్రంలో సూక్ష్మ పరిపాలనకు మెం డుగా అవకాశం లభించింది. తక్కువ విస్తీర్ణం… తక్కువ జనాభాతో కూడిన జిల్లాల ఏర్పాటుతో పాలనలో దూసుకుపోతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 30 లక్షల జనాభా ఉండేది. ఈ ప్రాంతం రెండుగా జిల్లాలుగా విడిపోవడంతో పర్యవేక్షణ సులువైంది. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలు రెండు విడిపోవడంతో ప్రజల చెంతకు ప్రభుత్వం ఆశించిన ఫలాలు చేరుతున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లాలను పునర్విభజన చేసుకోవడం ద్వారా ఎనలేని పురోగతి కనిపి స్తున్నది.
2016, అక్టోబర్ 11న పురుడు పోసుకున్న కొత్త జిల్లాల స్వరూపం నేడు అద్వితీయమైన ప్రగతితో దూసుకుపోతున్నాయి.ఒకప్పుడు సువిశాల విస్తీర్ణంతో కూడిన నిజామాబాద్ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఏ మూలకు వెళ్లి రావాలన్నా 24 గంటలు పట్టేది. ఒక రోజంతా ఒక ప్రాంతానికే సరిపోయేది. నిరంతర పర్యవేక్షణలో లోపాలు, తద్వారా పారదర్శకతలో లోటుపాట్లు వెరసి కచ్చితత్వంలో నష్టాలు వంటివి కనిపించేది. మరిప్పు డు నూతన జిల్లాలో పరిపాలన నూతన పంథాలో సాగుతున్నది. ప్రతి ఊరు, మండలానికి, నియోజకవర్గంపై స్వయంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరిగింది. సుపరిపాలనకు అధికార వికేంద్రీకరణ అన్నది రాచబాటను పర్చినట్లుగా మారింది.
Cmkcr
ఎనిమిదో వసంతంలోకి కామారెడ్డి జిల్లా…
తెలంగాణ అవతరణ అనంతరం ప్రణాళికబద్ధంగా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతున్నది. ప్రజల ముంగిటనే పాలన అందించేందుకు 33 జిల్లాలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సకల సౌకర్యాలతో పాలనా యంత్రాంగం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. తొమ్మిదిన్నరేండ్ల్లలో రాష్ట్రం భిన్న రంగాల్లో అభివృద్ధి సాధించింది.
మౌలిక వసతుల కల్పనకు విశేష ప్రాధా న్యం ఇవ్వడంతో తెలంగాణ స్వరూపమే మారింది. దశాబ్దాలుగా కరువు పీడిత ప్రాంతంగా ఉన్న కామారెడ్డి జిల్లా జల సిరులతో అలరారుతున్నది. పరిపాలన వికేంద్రీకరణను కేవలం భౌగోళిక మార్పులతోనే సరిపెట్టలేదు. విభజనకు అనుగుణంగా సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ భవనాలను అత్యద్భుతంగా నిర్మించి యావత్ దేశానికి ఆ దర్శంగా నిలిపారు. కామారెడ్డి రెవెన్యూ డివిజన్ కేంద్రం ఇప్పుడు జిల్లా కేంద్రమై పరిపాలనకు కేంద్ర బిందువుగా మారడంతో అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకు పోతున్నది. రాజధాని హైదరాబాద్‌కు 100కిలో మీటర్ల దూరంలోనే ఉన్న కామారెడ్డిని గతంలో సమైక్య పాలకులు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడీ ప్రాంతంలో సకల సౌకర్యాలు కల్పించబడ్డాయి. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో కామారెడ్డి రూపురేఖలు మరోసారి మారబోతున్నాయి.
అడుగడుగునా సుపరిపాలన వెలుగులు…
జిల్లా పునర్విభజనకు మునుపు అత్యవసర సమయాల్లో మాత్రమే జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లేవారు. కానిప్పుడు… ఏ సమస్య ఎదురైనా ప్రజల ముందు నిలబడి వారి అవసరాలను ఆలకిస్తున్నా రు. లబ్ధిదారుల వివరాలను ఒకప్పుడు కాగితాలపైనే పరిశీలించి వదిలేసే వారు. ఇప్పుడూ ఆ పరిస్థితే కనుమరుగైంది. భౌతికంగానే లబ్ధిదారులను ఉన్నతాధికారులే పరిశీలిస్తున్నారు. దీంతో కచ్చితత్వమన్నదీ రెట్టింపు స్థాయిలో పెరుగుతున్న ది. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ చేరుతున్నాయి. సామాజిక, ఆర్థిక, సాంస్కృతికంగా విభిన్నమైన పద్ధతుల్లో అభివృద్ధి చెందేలా జిల్లాకు ప్రాధాన్యత సైతం పెరిగింది. పునర్విభజన అనంతరం భౌగోళికంగా వేరు పడిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సమాన స్థాయిలో ఫలితాలు దక్కుతుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. జిల్లాల ఏర్పాటుతోనే కాకుండా మండలాలు, గ్రామాలను సైతం సీఎం కేసీఆర్ విభజించడంతో ఎక్కడికక్కడ పరిపాలన లో మార్పులు అద్భుతమైన ప్రగతిని సాధించి పెడుతున్నాయి.
ప్రజల అవసరాలను గుర్తించి…
శాస్త్రీయమైన పద్ధతుల్లో ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగా గడిచిన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో రాష్ట్రంలో అనేక భౌగోళిక మార్పులు, చేర్పులు జరిగాయి. మొదట జిల్లాలు, మండలాలు కూర్పు చేయగా ఆ తర్వాత గ్రామ పంచాయతీలను విడగొట్టి ప్రజలకు మరింతగా స్థానిక సంస్థల పరిపాలనను తీసుకు వచ్చారు. వీటితో పాటే కొత్త రెవెన్యూ డివిజన్లను, రెవెన్యూ గ్రామాలను పునర్వ్యవస్థీకరించారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే సీఎం కేసీఆర్ ఎంతటి సాహసానికైనా వెనుకడుగు వేయ రు. అందుకు నూతన జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటే నిదర్శనం. ఉమ్మడి జిల్లా విడిపోవడానికి ముందు కొన్ని దశాబ్దాలుగా 36 మండలాలతోనే కొనసాగింది. ఇప్పుడేకంగా నిజామాబాద్ జిల్లాలో 34 మండలాలు, కామారెడ్డి జిల్లాలో 25 మండలాలున్నాయి.
ప్రజలకు చేరువైన పాలన…
కామారెడ్డి జిల్లా కావడం, మెడికల్ కాలేజీ ఏర్పాటవ్వడం, సమీకృత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయ సముదాయం ఇలా ఒకటేమిటి జిల్లా ఏర్పాటుతో కామారెడ్డి రూపురేఖలన్నీ మారిపోయాయి. దీనంతటికీ కేసీఆర్ ముందు చూపు కారణం. వికేంద్రీకరణతో అద్భుతమైన ప్రగతికి సాధ్యమవుతున్నది. నేను కామారెడ్డి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా ఉన్న సమయంలోనే జిల్లా ఏర్పాటు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో ఏండ్ల కల సాకారం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రజలందరి తరపున ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా ఏర్పడి ఎనిమిదో వసంతంలోకి అడుగిడుతోన్న వేళ ప్రజలందరికీ శుభాకాంక్షలు.
– గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే
చాలా సౌకర్యంగా మారింది
నిజాంసాగర్, అక్టోబర్10 : కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మార్చడంతో మాకు చాలా సౌకర్యంగా మారింది. గతంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో నిజాంసాగర్ నుంచి సుమారు వంద కిలో మీటర్లు ప్రయాణించా ల్సి వచ్చేది. ఇప్పుడు సగానికి తగ్గింది. విద్యాశాఖకు సంబంధించిన ఏ పని ఉన్నా చాలా సలువుగా అవుతున్నది. గంటన్నరలో జిల్లా కేంద్రానికి వెళ్లి పని చేసుకుంటున్నాం. సమీకృత భవనం నిర్మించడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండడంతో అన్ని పనులు ఇట్టే పూర్తవుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
-భాస్కర్‌గౌడ్, పీఆర్టీయూ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు
పరిపాలన ఇబ్బందులు తొలగిపోయాయి
నిజామాబాద్ జిల్లా కేంద్రం ఉన్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సీఎం కేసీఆర్ కామారెడ్డిని జిల్లాగా మార్చడంతో మాకు పరిపాలనా పరంగా చాలా ఇబ్బందులు తొలగిపోయాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో ఎక్కువ మండలాలు, ఎక్కువ ఉద్యోగులు ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మన జిల్లా మనకు కావడం ఎలాంటి పని ఉన్నా ఇట్టే చేసుకొని వస్తున్నాం. మన జిల్లా మనకు కావడంతో ఎంత ఇబ్బందులు తీరాయో క్షేత్రస్థాయిలో మాకు స్పష్టంగా తెలుస్తున్నది. కేసీఆర్ సార్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది.
– గంగారాం, పంచాయతీ కార్యదర్శి, బంజపల్లి
అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా
ఉమ్మడి జిల్లా ఉన్న సమయానికి ఇప్పుడు చాలా తేడా ఉంది. నా భార్య మల్లూర్ సొసైటీ చైర్మన్. గతంలో ఉన్న చైర్మన్లు ఏ పని ఉన్నా నిజామాబాద్‌కు వెళ్లేవారు. ఇప్పుడు మనకు కామారెడ్డి జిల్లా 50 కిలో మీటర్ల దూరంలో ఉండ డం, సమీకృత భవనం పేరిట అన్ని కార్యాలయాలు ఒకే ప్రదేశంలో నిర్మించడంతో మహిళలు సైతం ఎవరి సహాయం లేకుండా వారే జిల్లా కేంద్రానికి వెళ్లి పనులు ముగించుకుంటున్నారు. దీనికి అంతటికీ కారణం మన సీఎం కేసీఆర్. కేసీఆర్ ముందు చూపుతో.. ఓ గొప్ప ఆలోచనతో కామారెడ్డిని జిల్లా కేంద్రంగా చేయడంతో జిల్లాలో ఉన్న మండలాలు సైతం అభివృద్ధి చెందాయి.
-విఠల్‌రెడ్డి, మల్లూర్, గ్రామం
కొత్త జిల్లాతో అభివృద్ధి వైపు పరుగులు
కామారెడ్డిని జిల్లాగా ఏర్పాటు చేయడం.. జిల్లాల వారీగా నిధులు విడుదల చేయడంతో జిల్లా కేంద్రంతో పాటు గ్రామాలు సైతం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. అధికారులు సమీ పంలో ఉండడం, పర్యవేక్షణ సులువుగా మారింది. గ్రామాల్లో పింఛన్లు, పల్లె ప్రగతి వంటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు చెందిన బిల్లులు, ఇతరాత్ర పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్తుంటాం. -లక్ష్మీనారాయణ, సర్పంచ్, మగ్దుంపూర్
అభివృద్ధిలో దూసుకుపోతున్నది
కామారెడ్డి,ఆక్టోబర్ 10 : కామారెడ్డి జిల్లా ఏర్పడిన నాటి నుంచి జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలు కలిగాయి. సమీకృత కలెక్టరేట్, వైట్ హౌస్‌ను తలపించే ఎస్పీ కార్యాలయాలు నిర్మించారు. ఇరుకుగా ఉన్న రోడ్లు విశాలంగా తయారయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు, మున్సిపాలిటీలు సుందరంగా మారాయి. చుట్టు పక్కల ఉన్న ఏడు గ్రామాలను మున్సిపాలిటీలో కలపడంతో జిల్లా కేంద్రం మరింత విస్తృతంగా మారింది.
-ఉషాకాంత్ (కామారెడ్డి)
పాలన మరింత చేరువ
గతంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పడింది. దీంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువ అయ్యింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చేసింది.
-డా.షేక్ రషీద్ (కర్షక్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్)
సకల సదుపాయాలు..
కామారెడ్డి జిల్లా ఏర్పడడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మౌలిక సదుపాయాలు కలిగాయి. కలెక్టర్ , ఎస్పీ కార్యాలయాలు ఒకే దగ్గర ఉండడంతో ప్రజలకు సేవలు చేరువయ్యాయి. ఉద్యోగులకు ప్రయాణ భారం పడడం లేదు. ఒకే దగ్గర అన్ని కార్యాలయాలు ఏర్పాటు కావడంతో పనులు సత్వరమే పూర్తి అవుతున్నాయి.
-నరాల వెంకట్ రెడ్డి (టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు)
జిల్లాల విభజనతో కామారెడ్డికి మహర్దశ…
రాష్ట్రంలో జిల్లాల విభజన చేయడంతో కామారెడ్డి జిల్లాగా ఏర్పడింది. దీంతో కామారెడ్డికి మహర్దశ వచ్చింది. జిల్లా కేంద్రం అయిన తర్వాత అభివృద్ధి పథంలో ముందంజలో ఉంది. జిల్లా కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో జిల్లా ప్రజలకు న్యాయసేవలు చేరువయ్యాయి.
-నిమ్మ దామోదర్ రెడ్డి (పబ్లిక్ ప్రాసిక్యూటర్)
గతంలో చాలా ఇబ్బందిగా ఉండేది….
కామారెడ్డి జిల్లా ఏర్పడక ముందు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏది అవసరం ఉన్నా నిజామాబాద్‌కు వెళ్లి రావాల్సి వచ్చేది. జిల్లా ఏర్పడడంతో ఉన్న ఊర్లోనే అనేక సమస్యలు తీరుతున్నాయి. ఏ పని పడ్డా కామారెడ్డిలోని పనులు జరుగుతున్నాయి.
-పుట్ట భూదేవి (గృహిణి)