కామారెడ్డిలో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఆలయం
వినాయక చవితికి ముస్తాబైన గుడి
నేటి నుంచి విశేష పూజా కార్యక్రమాలు
తరలిరానున్న భక్తజనంవిద్యానగర్, సెప్టెంబర్ 9:
నేడు వినాయక చవితి. విఘ్నాలు తొలగించే లంబోదరుడు పూజలందుకోవడానికి సిద్ధమయ్యాడు. గల్లీగల్లీలో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. వినాయకుడి ఆలయాలూ చవితి వేడుకలకు సిద్ధమయ్యాయి. ఇందులోభాగంగాకామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న సంకష్టహర మహాగణపతి ఆలయం ముస్తాబైంది. తెలంగాణ కాణిపాకంగా పిలుచుకునే ఈ ఆలయం ఎంతో మందికి విఘ్నాలు తొలగించే ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా వెలిసింది. భక్తుల కోర్కెలు తీరడంతో భక్తుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ఆలయాన్ని వేద పురోహితులు గంగవరపు ఆంజనేయ శర్మ,ఆలయ కమిటీ సభ్యులు, అ ర్చక బృంద సహకారంతో 2005 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ఆలయంలో నవగ్రహాలు, అమ్మవారి ఆలయం, సాయిబాబా ఆలయం ఇలా ఉప ఆలయాలు ఉన్నాయి. ప్రతి వినాయక చవితి రోజు విశేష పూజలు నిర్వహిస్తారు.
ప్రత్యేక పూజలు
ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
10వ తేదీన వినాయక చవితి సందర్భంగా ముందుగా 108 మంది గణపతి దీక్షాధారణ చేస్తారు.1000 మోదకాలతో సహస్ర మోదక గణపతి హవనం, కలశ స్థాపన తదితర పూజలు నిర్వహిస్తారు.
11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు, సాయంత్రం చతుషష్టి పూజలు, డోలోత్సవం, భజన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
14వ తేదీన సోపాన విశేష పూజ (పడి పూజ), మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.
16వ తేదీన సామూహిక కుంకుమార్చనలు,విశేష పూజలు నిర్వహిస్తారు.
18న ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గణపతి కల్యాణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది వరకు భక్తులు పాల్గొంటారు.
కోర్కెలు తీర్చే తెలంగాణ కాణిపాక వినాయకుడు
కోరిన కోరికలు తీర్చే తెలంగాణ కాణిపాక వినాయకుడుగా సంకష్టహర గణపతి ఆలయం విరాజిల్లుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి భక్తులతో వివిధ రకాల పూజలందుకుంటూ కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. ప్రతి వినాయక చవితి రోజు విశేషంగా పూజలు అందుకుంటాడు. నవరాత్రి ఉత్సాలవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తిచేశాం.
విద్యానగర్, సెప్టెంబర్: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడికి ఎన్నో రకాలు నైవేద్యాలు సమర్పిస్తారు. చవితి నాడు ఉండ్రాళ్లు, కుడుములు, బూరెలు, పాయసం.. ఇలా రకరకాల పిండి వంటలను చేసి నైవేద్యం పెడతారు. అయితే ఇందులో ముఖ్యమైనది లడ్డూ. మండపాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడి చేతిలో లడ్డూ తప్పనిసరిగా ఉంటుంది. దీంతో లడ్డూలకు గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వినాయకచవితిని పురస్కరించుకొని లడ్డూల ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కేవలం చవితి కోసమే ఈ లడ్డూలను తయారుచేసి విక్రయిస్తారు. కొంతమంది ఆర్డర్ ఇచ్చి తయారుచేసుకోగా, మరికొందరు కిలోల చొప్పున కొనుగోలు చేస్తారు.
60 క్వింటాళ్లలడ్డూలు అమ్ముతాం
వినాయక చవితి వచ్చిందంటే కామారెడ్డి పట్టణంతోపాటు చుట్టు పక్కల నుంచి ప్రజలు వచ్చి లడ్డులనూ కొనుగోలు చేస్తారు. ప్రతి ఏడాది 60 క్వింటాళ్ల వరకు లడ్డూలను అమ్ముతాం. వినాయకుడికి లడ్డూ పెట్టడానికి ఉత్సవ నిర్వాహకులు పోటీపడుతారు. వారికి తగ్గట్టుగా ఆర్డర్ పై పెద్ద పెద్ద లడ్డూలను తయారు చేస్తాం.
-లక్ష్మణ్, లడ్డూల విక్రయ కేంద్రం యజమాని