బాన్సువాడ, జూలై 5: ప్రభుత్వం కోట్ల రూపాయలతో ప్రజల కోసం వేసిన బీటీ రోడ్డుపై కేజీవీల్స్‌తో నడిచే ట్రాక్టర్లను సీజ్ చేయాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సోమవారం అందజేశారు. అనంతరం బోధన్, బాన్సువాడ ఆర్డీవోలు, డీఎస్పీలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్రం మొత్తానికి కలిపి రోడ్ల మరమ్మతులకు రూ.300 కోట్లు మంజూరు చేసేదని, కానీ స్వరాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గానికే 300 కోట్ల నిధులు తెచ్చి నాణ్యమైన రోడ్డు వేశామన్నారు. కోటగిరి మండలం హెగ్డోలి నుంచి యాద్గార్పూర్ మీదుగా రూ. 3 కోట్లతో బీటీ రోడ్డు వేశామని, అక్కడ కూడా కేజ్‌వీల్ ట్రాక్టర్లు తిప్పుతున్నారని అన్నారు. రోడ్డుపై కేజ్‌వీల్ ట్రాక్టర్ కనిపిస్తే వెంటనే సీజ్ చేయాలని సూచించారు.
నియోజకవర్గానికి 5 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ప్రొసీడింగ్స్ ఇచ్చారని తెలిపారు. కోటగిరి మండలానికి 1005, చందూర్‌కు 250 ఇండ్లు, మోస్రా 300, వర్ని 643, రుద్రూర్ 557 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇండ్లు కట్టుకునే వారికి ఇసుక కోసం పర్మిషన్ ఇవ్వాలని ఆర్డీవోలను ఆదేశించారు. సిమెంట్ కోసం కంపెనీలతో కలెక్టర్లు మాట్లాడాలని సూచించినట్లు తెలిపారు. నస్రుల్లాబాద్, రుద్రూర్, చందూర్, మోస్రా మండల కాంప్లెక్స్‌లకు కోటి రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఒకే చోట అన్ని శాఖల ఏఈలకు గదులు నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో బోధన్, ఆర్డీవోలు రాజేశ్వర్, రాజాగౌడ్, డీఎస్పీ జయపాల్ రెడ్డి, సీఐలు రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ , వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మున్సిపల్ కమిషర్ రమేశ్, మహ్మద్ ఎజాస్, వాహబ్ పాల్గొన్నారు.
కల్కి చెరువు కట్ట పనుల పరిశీలన
బాన్సువాడలో కల్కి చెరువు కట్ట మరమ్మతు పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం పరిశీలించారు. కట్ట పనులు నాణ్యతతో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకున్న ప్రజలకు డబ్బులు అందించడంలో కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆయన వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఇరిగేషన్ డీఈ శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.