నిజాంసాగర్, జూలై 5: కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు కండ్లముందు కనిపిస్తున్నాయని, తెలంగాణ రైతాంగం ఏటా రెండు పంటలు పండించాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్‌షిండేతో కలిసి వానకాలం పంటల సాగుకోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సోమవారం నీటిని విడుదల చేశారు. ముందుగా మండలంలోని హసన్‌పల్లి శివారులోని ప్రధాన కాలువ గేట్లకు, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ, మంజీర జలాలు వృథా కాకుండా ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రంలో కోటీ 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. నిజాంసాగర్‌కు ఎగువన ఇతర రాష్ర్టాల్లో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా ఆయకట్టు రైతులకు ఇప్పటిదాకా సాగునీరు సరిపడా అందలేదని అన్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు 1.50 టీఎంసీల నీటిని తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 7.40 టీఎంసీల నీటిని విడుతల వారీగా లక్షా 30వేల ఎకరాలకు అందించాలని సీఎం కేసీఆర్ సూచిం చారని తెలిపారు. జూలై మాసంలో నిజాంసాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించడం గతంలో ఎన్నడూ చూడలేదని, ఇదే తొలిసారి అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ రైతుబంధు పథకం ద్వారా రూ.7500 కోట్లు అందించారని అన్నారు. అనంతరం నాగమడుగు మత్తడి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ శరత్, నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఎస్ఈ మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, డీఈఈ శ్రావణ్, ఎంపీపీ పట్లోల్ల జ్యోతిదుర్గారెడ్డి, డీఎస్పీ జైపాల్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్తోపాటు నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కుర్, కోటగిరి, వర్ని, నస్రుల్లాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జూలైలోనే సాగునీరివ్వడం చరిత్రాత్మకం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
నిజాంసాగర్ ఆయకట్టుకు జూలై నెలలోనే సాగునీటిని అందించడం చరిత్రాత్మకమని, ఇది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. స్పీకర్ పోచారం, ఎంపీ పాటిల్, ఎమ్మెల్యే షిండే, జడ్పీ చైర్పర్సన్ శోభతో కలిసి ఆయకట్టుకు నీటి విడుదల అనంతరం మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా 1.50 టీఎంసీల నీరు నిజాంసాగర్‌లోకి రావడంతోనే ఇంతముందుగా నీటి విడుదల సాధ్యమైందని అన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్‌లో 7.40 టీఎంసీల నీరు నిల్వఉందని, ఆయకట్టు కింద అలీసాగర్ వరకు 1.10 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించనున్నామని చెప్పారు.
ఆయకట్టు పంటలు గట్టెక్కెందుకు అవసరమైతే మరో రెండు టీఎంసీల నీటిని ముఖ్యమంత్రి ఇస్తారని తెలిపారు. గోదావరి, మంజీర జలాలు కలిపి ప్రస్తుతం నిజాంసాగర్‌లో నిలువ ఉన్నాయని, ఈ ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలకు పుష్కలంగా నిధులు మంజూరు చేసి గ్రామాల వికాసానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే షిండే కోరిక మేరకు మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు స్పీకర్, ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి హసన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతిలో పాల్గొని మొక్కలను నాటారు.