నస్రుల్లాబాద్, ఏప్రిల్ 17: నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ‘కల్లు’ బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కల్తీ కల్లు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్యం అందించారు. ఈ నేపథ్యంలో అనుమతిలేని కల్లు దుకాణాలను ఎక్సైజ్ శాఖ అధికారులు మూసివేయించారు. కానీ ప్రస్తుతం గ్రామాల్లో కల్లుకు అలవాటు పడిన కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు.
ముఖ్యంగా బీర్కూర్ మండలం మల్లాపూర్లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఈ విషయం తెలుసుకున్న వైద్యశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు వృద్ధులు మాట్లాడుతూ.. తమకు కల్లు అలవాటయ్యిందని, కల్లు తాగకపోతే నిద్ర కూడా సరిగ్గా రావడంలేదన్నారు. మరికొందరు వింతగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అయితే కొంతమంది బాధితులు గ్రామంలోని రోడ్డుపైకి చేరుకొని కల్లు కావాలని నిరసన చేపట్టడం గమనార్హం.