ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు పత్తాలేకుండా పోయారు. ఇటువైపు పర్యటించేందుకు కూడా తీరిక చూసుకోవడం లేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఓసారి కామారెడ్డి పర్యటనకు వచ్చారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పంట నష్టం పరిశీలనకు తప్పా మరోసారి ఇటువైపే కన్నెత్తి చూడలేదు. ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఆయన.. శీతకన్ను ప్రదర్శిస్తున్నట్లు పలువురు తప్పు పడుతున్నారు.
ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి మంత్రిగా ఎవ్వరికీ అవకాశం దక్కలేదు. సలహాదారు పదవిలో షబ్బీర్ అలీ ఉన్నప్పటికీ మంత్రి పదవి మాదిరిగా ప్రభావితం చేసే పరిస్థితి లేదు. దీంతో ఉభయ జిల్లాలో పరిపాలన గందరగోళంలో పడింది. మంత్రి లేని ఈ ప్రాంతానికి అడపాదడపా వచ్చి సమీక్షలు, సమావేశాలు చేయాల్సిన ఇన్చార్జి మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ పరంగా ఇబ్బందులు తలెత్తుతుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
-నిజామాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ, రెండు చోట్ల బీఆర్ఎస్, మరో మూడు చోట్ల బీజేపీ గెలిచింది. ఆధిపత్యం పరంగా ఆయా పార్టీల బలాలు తీసిపోనట్లుగానే ఉన్నప్పటికీ ఈ మధ్యనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి కండువా మార్చారు. కాంగ్రెస్‌లో చేరి అధికార పార్టీలో కొనసాగుతున్నారు.
ఇందులో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఆరుగురు ఉండగా సీనియర్ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసిన పోచారం శ్రీనివాస రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. నిధుల వినియోగంలో ఇబ్బందులు, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వంతో విన్నపాలు సమర్పణలో వీరంతా ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తున్నది. రెండు జిల్లాల్లోనూ మంత్రిగా ఎవ్వరికీ బాధ్యతలు ఇవ్వకపోవడంతో నియోజకవర్గాల సమస్యలను ఇన్చార్జి మంత్రితోనే పంచుకుంటున్నారు. పేరుకుపోతున్న సమస్యలను వినతుల రూపంలో హైదరాబాద్‌కు వెళ్లి ఇచ్చేసి వస్తున్నారు. కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరించడం లేదు.
ప్రోటోకాల్ ఉల్లంఘనలతోపాటు ప్రజల అవసరాలను తీర్చేందుకు ఆయా శాఖల అధికారులంతా అధికార పార్టీ నేతల మాటలనే వింటున్నారు. వీటన్నింటి పరిష్కారానికి జిల్లా అభివృద్ధిపై సమీక్షలు, సమావేశాలు జరగాల్సి ఉందంటూ ఎమ్మెల్యేలంతా కోరుకుంటున్నారు. దీంతో జిల్లా, నియోజకవర్గాలపై పట్టు రావడంతో ప్రజా అవసరాలను తీర్చేందుకు సంపూర్ణ అవగాహన వస్తుందని పలువురు భావిస్తున్నారు. కానీ ఇన్చార్జి మంత్రి మాత్రం చొరవ తీసుకున్నదే లేకపోవడంతో ఎమ్మెల్యేలంతా ఆగమాగం అవుతున్నారు. చిక్కుముడులు విప్పేందుకు జూపల్లి కృష్ణారావు ముందడుగు వేయకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఈ మధ్యనే ఓ సందిగ్ధత ఏర్పడింది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్‌పై బీజేపీ కన్నెర్ర చేసింది. ఎస్డీఎఫ్ నిధులను ఇతర ప్రాంతాలకు తరలించడం మానుకోవాలంటూ వారంతా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అంతా నగరపాలక సంస్థ పరిధిలోనే ఉన్నందున ఎస్డీఎఫ్ నిధులను నగరానికే ఖర్చు చేయాలంటూ కోరుతున్నారు.
ఇలా మచ్చుకు ఎదురవుతున్న సమస్యలు అనేకం ఉన్నాయి. అధికార పార్టీ నేతలంతా తమకు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తుండడంతో బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లా ప్రగతి, అభివృద్ధిపై దిశానిర్దేశానికి ఇన్చార్జి మంత్రి చొరవ తీసుకొని, సమీక్ష సమావేశాలను నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీతోపాటు అధికార పార్టీలోని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇన్చార్జి మంత్రి రాకతో ఉభయ తారకమంత్రం మాదిరిగా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం రావడంతోపాటు కాంగ్రెస్ పార్టీలోనూ చోటా, మోటా నాయకులకు తమ విన్నపాలను చెప్పుకునే వీలుంటుందని భావిస్తున్నారు.
అయితే మంత్రి రాకను కొంతమంది నేతలు స్వాగతిస్తుండగా, కీలక నేతలు వ్యతిరేకిస్తుండడంతోనే ఈ సందిగ్ధత కొనసాగుతున్నట్లుగా తెలుస్తున్నది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు సమయం ఇవ్వకపోవడం, ఇన్చార్జి మంత్రి రాకతో తమ ప్రాబల్యం తగ్గుతుందేమోనని భయం, ప్రభుత్వ యంత్రాంగంలో పట్టు పోతుందేమోనన్న ఆందోళనతో ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించడం లేదన్న చర్చ జోరుగా సాగుతున్నది.