పిట్లం, ఏప్రిల్ 3: బీఆర్ఎస్ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. పిట్లం మండలంలోని చల్లర్గి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షిండే ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమ్మేళనంలో ముందుగా ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ..కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో 50 ఏండ్లలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని తెలిపారు.వంద గ్రామాలకు 80 గ్రామాల్లో బీటీరోడ్లు నిర్మించినట్లు చెప్పారు. గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి, తాగునీరు, రహదారులు, మురికి కాలువల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ వెళ్లి తెలియజేయాలన్నారు. జుక్కల్ నియోజకవర్గానికి 11వందల దళితబంధు యూనిట్లు మంజూరైనట్లు చెప్పారు. వీటిలో చిల్లర్గి గ్రామానికి చెందిన వారు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని, బాధిత కుటుంబాలను దళితబంధు పథకం కింద ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో రైతుల సాగు కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ రూ.476 కోట్లతో నాగమడుగు లిఫ్టు ఇరిగేషన్ మంజూరు చేసి 40 వేల ఎకరాల భూమికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టారని గుర్తుచేశారు.చిల్లర్గి నుంచి పెద్దకొడప్గల్, మాగి గేటు నుంచి కిష్టాపూర్ వరకు డబుల్ రోడ్డు మంజూరు చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని, త్వరలో పనులు పూర్తిచేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరగా.. పార్టీ వెంటే ఉంటామంటూ మహిళలు చేతులెత్తి మద్దతు పలికారు. సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ ఆత్మీయ సమ్మేళన సందేశాన్ని పిట్లం గ్రామ రైతుబంధుసమితి అధ్యక్షుడు జొన్న శ్రీనివాస్‌రెడ్డి చదివి వినిపించారు. సమావేశంలో ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అన్నారం వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్, బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్‌రెడ్డి, రజినీకాంత్‌రెడ్డి, కుమ్మరి రాములు, బాబుసింగ్, లక్ష్మారెడ్డి, రమేశ్, శపథంరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, విండో డైరెక్టర్లు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.