బాన్సువాడ రూరల్/ఇందల్వాయి, అక్టోబర్ 23: పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు న్యాయం చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదేశించారు. గిరిజనులను అకారణంగా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బాన్సువాడ మండలం కాద్లాపూర్ గ్రామానికి చెందిన కొందరు ఎస్టీలు ఇటీవల జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేయగా, స్పందించిన కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ బుధవారం కాద్లాపూర్కు వచ్చారు. పోడు భూములలో సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు అటవీశాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ కిరణ్మయి, డీఎస్పీ సత్యనారాయణగౌడ్, తహసీల్దార్ వరప్రసాద్ ఉన్నారు.
ఇందల్వాయి మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో వసతులు సరిగా లేకపోవడంపై ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పాఠశాలను సందర్శించిన ఆయన.. 2017లో పాఠశాల ప్రారంభమైతే ఇప్పటివరకు సరైన వసతుల్లేక పోవడంపై అధికారులను నిలదీశారు. మరోసారి వస్తానని, ఏర్పాట్లు చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీటీడీఓ నాగోరావు, రజిత, ఆర్సీవో గంగారాంనాయక్, డీసీవో సోమ్లనాయక్, తహసీల్దార్ వెంకట్రావు, ఎంపీడీవో లక్ష్మారెడ్డి ఉన్నారు.