ఎల్లారెడ్డి రూరల్/లింగంపేట/ జూలై 24: ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. లింగంపేట్‌లో కొన్నినెలల క్రితం నిర్వహించిన ఓ కార్యక్రమంలో దళిత నాయకుడి దుస్తులను పోలీసులతో ఊడతీయించారని గుర్తుచేశారు. అంతేగాకుండా ఎల్లారెడ్డి మండలం మ ల్కాపూర్కు చెందిన దళితుడి ఇంటి నిర్మాణాన్ని ఇటీవల కూలగొట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను అరికట్టేందుకు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేయడానికి ఆత్మగౌరవ గర్జన సభ ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు.
లింగంపేట్‌లో శుక్రవారం నిర్వహించనున్న ఆత్మగౌరవ గర్జన సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి, లింగంపేట మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 48వ జన్మదిన వేడుకలను గురువారం జాజాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం తాడ్వాయిలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమై ఆత్మగౌరవ గర్జన సభపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి రోజున మాజీ ఎంపీపీ ముదాం సాయిలు పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించి, అక్రమ కేసులు నమోదు చేశారని తెలిపారు, ‘ఆత్మగౌరవ గర్జన’లో భాగంగా ముదాం సాయిలును కేటీఆర్ పరామర్శిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20నెలలు అవుతున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నది. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. రాక్షస పాలనను తలపించేలా రేవంత్ సర్కారు పోలీసులను అడ్డం పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున లింగంపేట మండల కేంద్రంలో దళిత ప్రజాప్రతినిధిపై పోలీసుల తీరు నిదర్శనమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పాలకుల తీరును నిరసిస్తూ ఆత్మగౌరవ గర్జనను నిర్వహిస్తున్నాం. ప్రజాస్వామ్యానికి మచ్చగా మారిన ఈ దుష్ట పాలనకు చరమగీతం పాడేందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్త్తుంది.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే