ఆర్మూర్‌టౌన్ , సెప్టెంబర్12: షరతుల్లేని రుణమాఫీ, రైతుభరోసా పథకం అమలు కోసం రైతాంగం మరో పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ఇచ్చిన రెండు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ధర్నా నిర్వహించనున్నట్లు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది.
నిజామాబాద్ రూరల్, బాల్కొం డ, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని అన్ని తహసీల్ ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఆర్మూర్‌లోని ఎంఆర్ ఫంక్షన్హాల్లో గురువారం సమావేశమైన రైతు కమిటీ ప్రతినిధులు ఇట్టడి గంగారెడ్డి, నూతుల శ్రీనివాస్, దేగాం యాదగౌడ్, సుక్కి సుధాకర్, తిరుపతిరెడ్డి, అల్లూరి గంగారెడ్డి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు షరతుల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద రూ.7500 చొప్పున ఇవ్వడానికి తాము సెప్టెంబర్ 15 వరకు సమయం ఇచ్చామన్నారు.
గడువు దగ్గరకొస్తున్నా ప్రభుత్వంలో చలనం కరువైందని మండిపడ్డారు. 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 16న అన్ని తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాక పోతే రైతుల సత్తా చూపిస్తామన్నారు.